ఏపీ బంద్‌ విజయవంతం

21:56 - April 16, 2018

గుంటూరు : కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఆగ్రహం బంద్‌ రూపంలో వ్యక్తమైంది. ఉదయం నుంచే స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించి బంద్‌ను సక్సెస్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బంద్‌ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి.. రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలిపారు. బంద్‌ సక్సెస్‌ కావడంతో ఆందోళనలు ఉధృతం చేసేందుకు ప్రత్యేక హోదా సాధన సమితి సిద్దమవుతోంది. ఈనెల 24న బ్లాక్‌డేగా పాటించాలని పిలుపునిచ్చారు. 20న సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 
ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో బంద్‌ 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర బంద్‌ విజయవంతమైంది. బంద్‌లో వామపక్షాలు, జనసేన, ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. తెల్లవారుజాము నుంచే పలువురు రోడ్లపైకి వచ్చి బంద్‌ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని డిపోల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ప్రజలు స్వచ్ఛంధంగా బంద్‌ నిర్వహించారు. వ్యాపారసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, సినిహా హాళ్లు మూసివేసి బంద్‌కు సహకరించారు. బంద్‌ నేపథ్యంలో అన్ని పార్టీల కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి ఆందోళనలు తెలిపారు. మానవ హారాలు నిర్వహించి తమ నిరసనలు తెలిపారు. ఇక బంద్‌ నేపథ్యంలో ఏపీలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు... పరీక్షలను వాయిదా వేశారు. 
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం 
ఇక రాష్ట్రానికి కేంద్రం చేసిన మోసాన్ని నిరసిస్తూ విజయవాడలో జనసేన నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కడపలో వామపక్ష నేతలు ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి అప్సర సర్కిల్‌, కృష్ణా సర్కిల్‌మీదుగా బైక్‌ ర్యాలీ నిర్వహించి బంద్‌ నిర్వహించారు. బీజేపీ, టీడీపీలు ప్రజలను మోసం చేశాయని వామపక్ష నేతలలన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో వామపక్షాలు, వైసీపీ, కాంగ్రెస్‌, జనసేన నేతలు బంద్‌ నిర్వహించారు. బంద్‌ సక్సెస్‌ అయితే... కేంద్రం దిగివచ్చి ప్రత్యేక హోదా ఇస్తుందన్నారు. రాజమండ్రి అఖిలపక్ష నేతలు బంద్‌లో పాల్గొన్నారు. కోటిపల్లి బస్టాండ్‌ వద్ద ఆందోళనకు దిగిన నేతలు, కార్యకర్తలు.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, మోదీ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట బస్టాండ్‌ ఎదుట కేంద్రం వైఖరిని నిరసిస్తూ సీపీఎం, సీపీఐ, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు మానవహార నిర్వహించారు. శ్రీకాకుళంలో బంద్‌ చేస్తున్న నేతలు పోస్టాఫీసులో ఉద్యోగులను బయటకు పంపి కార్యాలయానికి తాళం వేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు బంద్‌ నిర్వహించాయి. విభజన హామీలు నెరవేర్చాలంటూ ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ వామపక్షాలు, జనసేన, వైసీపీ, కాంగ్రెస్‌ నేతలు ర్యాలీ చేపట్టారు. కర్నూలు జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు బంద్‌ నిర్వహించాయి. మోదీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు.. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.  విజయనగరం జిల్లాలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద బంద్‌ నిర్వహిస్తున్న అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ బంద్‌ ప్రశాంతంగా జరిగింది. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నేతలు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ కర్నూలులో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు రోడ్డుపైనే కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. 
ఉద్యమాన్ని అణిచివేసేందుకు చంద్రబాబు యత్నం 
విజయవాడ బస్టాండ్‌ వద్ద బంద్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి ఛైర్మన్‌ చలసాని శ్రీనివాస్‌ పాల్గొన్నారు. బంద్‌లో ప్రజలందరూ పాల్గొంటుంటే.. పోలీసులతో ఉద్యమాన్ని అణిచివేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని నేతలు మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదన్నారు. 
పలుచోట్ల అరెస్టులు 
శాంతియుతంగా బంద్‌ చేస్తున్నవారిని పలుచోట్ల అరెస్టులు చేయడం దారుణమన్నారు చలసాని శ్రీనివాస్‌. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 24న బ్లాక్‌డే పాటించాలని పిలుపునిచ్చారు. అదేరోజు రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు లైట్లన్నీ ఆర్పివేసి చీకటిమయం చేయాలన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని... ఇందుకోసం 20న భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మొత్తానికి ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌ విజయవంతమైది. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ప్రత్యేక హోదా ప్రకటించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు మరోసారి స్పష్టం చేశారు. 

 

Don't Miss