కాంగ్రెస్‌లో గద్దర్...

06:47 - October 12, 2018

హైదరాబాద్ : ఒకప్పుడు బుల్లెట్ తోనే రాజ్యాధికారమన్న ఉద్యమ కారుడు గద్దర్…. నేడు ప్రజాప్రతినిధిగా కొనసాగేందుకు బ్యాలెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఏ పార్టీలో చేరుతారనే సందిగ్ధతకు తెరపడింది. గద్దర్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. సీపీఎం, ఇతర ప్రజా సంఘాలు ఏర్పాటు చేసిన బీఎల్ఎఫ్ తరపున పోటీ చేస్తారని భావించినా చివరకు ఆయన కాంగ్రెస్‌లో చేరడానికి మొగ్గు చూపారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టివిక్రమార్కతో భేటీ అయిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గురువారం రాత్రే మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌తో కలిసి గద్దర్ ఢిల్లీ చేరుకున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. 

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నగరా మోగడంతో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ను ఓడించడానికి రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఏకమౌతున్నాయి. అందులో భాగంగా కాంగ్రెస్ పెద్దన్నగా అవతరించి మహా కూటమి ఏర్పాటు దిశగా పావులు కదుపుతోంది. ఇందులో టిడిపి, కోదండరాం పార్టీ, ఇతర పార్టీలు చేరనున్నాయి. ఇంకా పొత్తులు, సీట్లపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గద్దర్ మహాకూటమికి మద్దతు తెలియచేసే అవకాశం ఉంది. మహాకూటమి అభ్యర్థిగా గద్దర్‌ను గజ్వేల్ బరి నుండి కేసీఆర్‌పై పోటీ చేయిస్తారనే ప్రచారం ఎప్పటి నుండో సాగుతోంది. గద్దర్ బాటలోనే మరికొంతమంది ప్రజా ఉద్యమకారులు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. మరి కాంగ్రెస్ తరపున గద్దర్ ప్రచారం ఏ మాత్రం కలిసివస్తుందో వేచి చూడాలి. 

Don't Miss