కోమటిరెడ్డి ఏతులు ఇనుండ్రి..

20:18 - May 22, 2018

ఊర్లపొంటి దొంగలొస్తున్నరట..? మందిని సంపుతున్నరట.. ఇండ్లన్ని దోస్తున్నరట.. పక్కపొంటి ఊరికాడ దొర్కిండ్రట.. ఇట్ల రకరకాల పుకార్లు శికారు జేస్తున్నయ్ సోషల్ మీడియాల.. అటు పోలీసోళ్లు ఎంత మొత్తుకున్నా జనానికి అర్థమైతలేడు.. ఎవ్వడన్న మాశిన బట్టలు పెర్గిన నెత్తితోని గనిపిస్తె వాన్ని వట్కోని సావగొడ్తున్నరు జనం..

ఆంధ్ర రాష్ట్రంల ఎన్నికల వేడి సుర్వైంది.. అసెంబ్లీ ఓట్లకు ఇంకో యాడాది టైమున్నా..? అన్ని పార్టీలు ఒకదాన్ని మించి ఇంకోటి జనంలకు వోతనేఉన్నయ్.. పొయ్యే రూపం వేరున్నా..? అంతిమ లక్ష్యం మాత్రం జనంతానున్న ఓటును గుంజుకునుడే అన్నట్టు.. తెల్గుదేశం గ్రామదర్శిని అంటున్నది.. వైసీపీ పాదయాత్ర జేస్తున్నది.. జనసేనా బస్సుయాత్ర.. జేడీ లక్ష్మీనారాయణ భరోసా యాత్ర, సీపీఎం లెఫ్ట్ పార్టీలు పిట్రోలు యాత్రలు..

నన్ను విమర్శించే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి లేదు అంటున్నడు నీతికి నిల్వుటద్దమైన శ్రీ నారా చంద్రాలు సారు.. మీరు రాష్ట్రపతి ఎన్నికలళ్ల.. ఉపరాష్ట్రపతి ఎన్నికలళ్ల బీజేపీ అభ్యర్ధికి అనుకూలంగ ఓట్లేశి రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు వెట్టినోళ్లు మీరు నన్నా అనేది అని మస్తు గరమైతున్నడు సారు..

ఏతుల పుంజు ఏతుల పుంజు అంటె ఇన్నరుగని.. ఏతుల పుంజు ఎట్లుంటదో సూశిండ్రా మీరు ఎన్నడన్న..? నల్లగొండ నడిగడ్డమీదున్నది ఆ పుంజు.. ఆ పుంజు ఏతులు జూస్తే.. అవద్దాలు ఆత్మహత్య జేస్కుంటయ్.. మమ్ములను మించిన మొనగాడున్నడా ఈ భూమ్మీద అని..? మరి ఆల్చమెందుకు పాండ్రి సూపెడ్త..

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కాడ ఎక్వేం లేదు.. ఐదే ఎక్రాలు కబ్జా వెట్టి పట్టా జేపిచ్చుకున్నరట మన లీడర్లు.. ఎంత శిగ్గుతక్వ ముచ్చట ఒక్కడొక్కడు వందల ఎక్రాలు కబ్జాలు వెట్టుకుంటున్నరు.. వాడెవ్వడో ఐదే ఎక్రాలు వెడ్తడా..? చేశిన దొంగతనమన్న గట్టిగ జేయరాయే.. ఓ యాభై ఎక్రాలు వెడ్తె మన ముఖ్యమంత్రిగారు పర్వునిలవెట్టినోళ్లు అయితరుగని.. చిన్నచిన్నగ జేస్తారు.. ఆయ్..

ఆంచూర్ రైతులు మళ్లొకపారి మోసపోయిండ్రు మార్కెట్ల.. పోయిన యాడాది గూడ ఇసొంటి మోసమే అయ్యింది ఈసారి గూడ రిపీట్ అయ్యింది.. నిజామాబాద్ జిల్లాల ఆంచూర్ రైతులు చాలమందుంటయ్.. అదే అంచూర్ అంటే మామిడి కాడ ఒర్గుదీశి ఎండవెట్టేది.. మద్దతు ధర దొర్కుతదేమో అని మామిడి చెట్టంత ఆశవెట్టుకోని మార్కెటుకోస్తె మళ్ల గదే దళారీగాళ్లు తల్గి ధర తక్వ జేశి కొంటున్నరట..

ఇదే కన్ఫ్యూజన్ మళ్ల.. నిన్నరాత్రి జగిత్యాల జిల్లాకేంద్రంలున్న సర్కారు దావఖానకు ఇద్దరు గర్భిణీ స్త్రీలొచ్చిండ్రట.. డెలివరీ కోసం ఇద్దరికి ఒక్కటే సారి కాన్పు జేశిండ్రు.. ఇద్దరికి మొగపిల్లలే వుట్టిండ్రు.. మరి ఏడ తేడా వచ్చిందో ఏమో.. మా పిలగాన్ని వాళ్లకిచ్చిండ్రు.. వాళ్ల పిలగాన్ని మాకిచ్చిండ్రని కయ్యం లేశింది.. ఇప్పటికి తేలలే పంచాది..

కోతులకు గూడ కోపం బాగనే ఉండెతట్టుందిగదా..? మన్సులకున్నట్టు.. అవ్విటికి గూడ ఒక్కొక్కపారి బీపీ వెర్గెతట్టుంది.. మన్సులను తంతున్నయ్.. ఇయ్యాళ తాజ్ మహాల్ జూస్తందుకు బైటిదేశం మన్సులొచ్చిండ్రట వాళ్ల మీద వడి కర్శినయట ఇద్దరికి గాయాలైనయంటున్నరు.. మరి అవ్వేమనుకున్నయో ఏమో ఈడ మేముండంగ మీరెట్లొస్తరని కోపానికొచ్చినయో ఎట్లనో గని..? కోతుల కథ జూడుండ్రి..

Don't Miss