దేవున్కి చిన్నారికి లగ్గం..చట్టాలు దేవునికి వర్తించయా?!

20:22 - May 5, 2018

అయ్యా జగన్ బాబు, జనసేనా బాబు.. ఇంటిరా ముచ్చట.. రాబోయే రెండువేల పందొమ్మిది ఎన్నికలళ్ల.. ఆంధ్రరాష్ట్రంలున్న అన్ని అసెంబ్లీ సీట్లు.. అన్నిఎంపీసీట్లు అన్ని కార్పొరేషన్ సీట్లు మేమే గెల్చుకోబోతున్నం.. అని చంద్రాలు సారు బ్రహ్మంగారు రాయంగ ఇడ్సిపెట్టిన కాలజ్ఞానం రాశి సద్విండు.. చంద్రాలు మాటలు ఇని మీరు గుండెవల్గేరు సుమా.. ఎట్లెట్ల చంద్రాలు..?

తెలంగాణ రాష్ట్రమొస్తె కేసీఆర్ జెప్పినట్టు నిజంగనే మా బత్కులు బంగారమైతయేమో అనుకున్నంగని.. అమ్మో ఇంతఆగమైతది మా బత్కు.. ఇంక నమ్ముతాము మేము అంటున్నరు.. కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. ఒక్క పెన్నుపోటుతోని మమ్ములను రెగ్కులరైజ్ జేస్తాన్న సారువారు ఏడవన్నడు ఇయ్యాల అని తీరొక్క తిట్టు తిడ్తున్నరు..

ఆర్మూరు బంగారం దొంగతనం కేసుల.. నిందితులు టీఆర్ఎస్ పార్టోళ్లు గాకుంట వేరేటోళ్లు ఉంటే.. ఈ పోలీసోళ్లు ఊకుంటుండెనా..? వాళ్ల ఇండ్ల మీదికి వొయ్యి గొర్ర గొర్ర గుంజుకొచ్చి స్టేషన్ల వడేశి నాల్గు సప్పరిచ్చి జైలుకు వంపకపోతుండే.. అధికార పార్టీ లీడర్లే దొంగలు అయ్యిండ్రన్న ఆరోపణ ఉన్నది గావట్టి వాళ్లను కనీసం అరెస్టు జేశే ధమ్ముగూడ లేదాయే మనోళ్లకు..

ఇప్పుడు గన్క టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మార్కెట్ల పొంట వోతె జనం గెదిమికొట్టెతట్టున్నరు.. ఎందుకంటె వడగండ్ల వానకు మార్కెట్ల పొంట ధాన్యం గొట్కపాయేగదా..? తెచ్చినయ్ తెచ్చినట్టు గొనకుంట తమాష జేశ్న సర్కారోళ్ల మీద మంటమీదున్నరు రైతులు.. నిన్న బోనగిరి మార్కెట్ కాడ.. కమిటీ చైర్మన్ను గెద్మినంత పనిజేశిండ్రు..

హరే నీయక ఎటువోతున్నది ఈలోకం ఏం కథ..? నిన్నమొన్న మనం ఎన్ని ముచ్చట్లు జెప్పుకున్నం చిన్నతనం పెండ్లీలు జేస్తే ఎంత ఆగమైతది అని..? అనంతపురం జిల్లా రాయదుర్గం కాడున్న ఒక గుడిలె దేవునికి.. చిన్నపిల్లకు పెండ్లి జేశిండ్రు అయ్యగార్లు.. భక్తజనమంతగల్చి.. బాల్యవివాహ వ్యతిరేక చట్టాలు దేవునికి వర్తించయా ఎట్ల..?

ప్రజలారా ఒక్క ముచ్చట మనం ఓపెన్గ మాట్లాడుకోవాలె.. నిజంగ దేవుడు అనేటాయిననే ఉంటే.. ఆయనకు ప్రజల మీద ప్రేమ అభిమానం.. వాళ్ల కష్టాలు తీర్చాలె అన్న కోరిక ఉంటే.. ఆ శక్తి యుక్తులే ఉంటే.. మిమ్ములను గుడిదాక రప్పిచ్చుకోడు.. చర్చిదాక గుంజుకరాడు మసీదు దాక రావాల్సిందే అని చెప్పడు.. ఆయననే మీ ఇంటికొస్తడుగదా.?? ఈ ముచ్చట ఎందుకంటె.. సూడుండ్రి..

డిగ్రీలు పట్టా సర్టిఫికేట్ గావాల్నా మీకు..? మీరు పుస్తకాలతోని కుస్తి వడి సద్వవల్చిన పనిలేదు.. క్లాసులకు రాకున్నా పర్వాలేదు.. ఖాళీ ఎగ్జాం ఫీజు గడ్తె సాలు మిమ్ములను ఫస్టు క్లాసుల ఫాసు జేపిచ్చె బాధ్యత మాది అంటున్నరు యాదాద్రి జిల్లా మోత్కురు కాడ ఓపెన్ డిగ్రీ పరీక్షల సెంటర్ నిర్వాహకులు.. ఒక పెన్ను పరీక్షకు మూడు వందల రూపాలిస్తె సాలు పేజీలు నిండెదాక రాస్కో.. ఇది కథ..

అబ్బా ఈ జనాలు గూడ ఎంత ఎడ్డోళ్లుగ తయ్యారైండ్రంటే.. గొర్రె కసాయోన్ని నమ్ముతదన్నట్టు.. వీళ్లు గూడ మోసం జేశేటోళ్లనే నమ్ముతుంటరు.. మీరు నాల్గు నాల్గు లక్షల రూపాలు గట్టుండ్రి మీకు సర్కారు నౌకర్లు ఇప్పిస్తాని చెప్పంగనే ఆడీడ అప్పుజేశి తెచ్చి ఆ సుప్పనాతి చేతుల వోశిండ్రు.. అది అందరి పైసలు మూటగట్టుకోని రాత్రికి రాత్రే జంపైంది.. ఇప్పుడు మొత్తుకుంటున్నరు ఇండ్ల తప్పెవ్వల్ది చెప్పుండ్రి..?

Don't Miss