తెలంగాణ ఎన్నికలు : ‘బాబుకు నిద్రలేని రాత్రులు’...

10:19 - December 6, 2018

హైదరాబాద్ : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు. ఈ మేరకు ఆయన మరోసారి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. మొన్నటికి మొన్న తెలంగాణ ఎన్నికలకు రూ. 1200 కోట్లను చంద్రబాబు తరలించారంటూ సంచలన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా డిసెంబర్ 6వ తేదీన బాబుపై మరో ట్వీట్ చేశారు.
మరో రూ. 500 కోట్లు...
‘‘టీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే చర్లపల్లి జైలుకు వెళ్లక తప్పదని చంద్రబాబు టెన్షన్ పడుతున్నాడు...ఓటుకు నోటు కేసు దర్యాప్తు చివరి దశకు వచ్చినందున నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు... రూ. 1200 కోట్లు సరిపోకపోతే మరో రూ. 500 కోట్లను ఏర్పాటు చేస్తానని నిన్న రాత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని తన నివాసానికి పిలిపించుకుని మరీ చెప్పారు’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 
బాబు ప్రచారం...
తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి పేరిట టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ పార్టీలు కలిసిన సంగతి తెలిసిందే.
అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం కూడా నిర్వహించారు. డిసెంబర్ 7వ తేదీన పోలింగ్..డిసెంబర్ 11న ఫలితాలు వెల్లడికానున్నాయి. తాజాగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై తెలుగు తమ్ముళ్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

Don't Miss