మూడేళ్ల పాలన...రైతులయ్యేనా కోటీశ్వరులు..

10:35 - June 1, 2017

హైదరాబాద్ : తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. అందులో ఎంతవరకూ విజయవంతమైంది? మూడేళ్ల పాలనలో రైతులకు ఏం చేసింది? వ్యవసాయానికి అందిన సాయమెంత? సిఎం కేసీఆర్‌ హామీలు ఎంతవరకూ అమలయ్యాయి? 10 TV ప్రత్యేక కథనం.. తెలంగాణ ఏర్పాటైనప్పటినుంచి ఇప్పటి వరకు పదిహేడు వందల ఇరవై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 680 కుటుంబాలకు పరిహారం అందించామని సర్కారు స్పష్టం చేస్తోంది. అయితే ప్రభుత్వ లెక్కలు అసంపూర్ణంగా ఉన్నాయన్న విమర్శలొస్తున్నాయి. కేవలం 28 జిల్లాల్లో ఆత్మహత్యలనే అధికారులు పరిగణలోకి తీసుకున్నారని రైతు సంఘాల నేతలు అరోపిస్తున్నారు. వాస్తవానికి ఈ మూడేళ్లలో 2వేల 600 మందికిపైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని రైతు సంఘాల నేతలు పేర్లతో సహా వివరిస్తున్నారు.

త్రిసభ్య కమిటీ విచారణ పేరుతో మరిన్ని ఇబ్బందులు..
అటు పరిహారం చెల్లింపులోనూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబసభ్యులను ముప్పుతిప్పలు పెడుతోంది ప్రభుత్వం. ఆత్మహత్య అని నిర్ధరించేందుకు 13 రకాల పత్రాలను అధికారులు అడుగుతున్నారు. ఆ పత్రాలన్నీ సమర్పించినా మళ్లీ త్రిసభ్య కమిటీ విచారణ పేరుతో బాధితుల్ని చెప్పులరిగేలా తిప్పుకుంటున్నారు. మరోవైపు రైతుల ఆత్మహత్యలకు ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేవలం భారత దేశంలో మాత్రమే వ్యవసాయం కోసం ప్రయివేటు అప్పులపై రైతన్నలు ఆధారపడుతున్నారు. ఈ డబ్బుకు అధిక వడ్డీలు చెల్లిస్తూ మరిన్ని ఇబ్బందుల్లో పడిపోతున్నారు. పెట్టుబడులు పెరిగిపోయి దిగుబడి సరిగారాక అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. వీటికితోడు నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, పురుగుల మందులు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఈ సమస్యలన్నీ దాటుకొని పంటను మార్కెట్‌కు తీసుకువెళితే అక్కడా గిట్టుబాటు ధర రావడం లేదు. వరుసగా రెండున్నరేళ్లు కరువు విలయతాండవం చేయడంతో పంటలు పండలేదు. ఇన్ని కష్టాలమధ్య వ్యవసాయం చేయలేక రైతులు బలవంతంగా తమ ఊపిరి తీసుకుంటున్నారు.

కోటి ఎకరాలకు పడిపోయిన సాగు విస్తీర్ణం..
ప్రభుత్వం రుణమాఫీ అమలు చేశామంటూ గొప్పగా చెప్పుకుంటున్నా రైతులకు ఇది ఏమాత్రం ఉపయోగపడలేదు. మొత్తం రుణంలో సంవత్సరానికి నాలుగో వంతు మాఫీ చేస్తామన్న సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ఏడాదికి నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల చొప్పున బ్యాంకులకు జమ చేసింది. ఈ డబ్బుకు మూడు వంతులు కలిపి బ్యాంకులు కొత్త రుణాలివ్వాలి. బ్యాంకులు మాత్రం పాత రుణాలకు వడ్డీ లెక్కగట్టి... అదే పావు వంతు నగదును రైతులకు చెల్లిస్తున్నారు. ఇలా బ్యాంకుల మాయాజాలంతో రైతన్నలకు రుణమాఫీ వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేకుండా పోయింది. బ్యాంకులు మాత్రం బుక్ అడ్జెస్ట్ మెంట్ చేసి అన్నదాతలకు మొత్తం రుణం ఇచ్చినట్టు పత్రాలు సిద్ధం చేస్తున్నాయి. దీంతో రుణమాఫీ ప్రహసనంగా మారింది. కొత్త రుణాలు పుట్టక.. పెట్టుబడులకు డబ్బు అందక.. రైతులు కాడి దించేయడంతో.. గడచిన మూడేళ్లలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. కోటిన్నర ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం కోటి ఎకరాలకు తగ్గిపోయింది. చెరకు రైతుల సమస్యల్ని తీర్చేందుకు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీకూడా మాటలకే పరిమితమైంది. నిజామాబాద్ జిల్లాలో చెరుకు పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామన్న వాగ్దానం ఆచరణకు ఆమడదూరంలో నిలిచింది. నిజాం షుగర్స్ మూసివేత ముగిసిన అధ్యాయమని శాసన సభలో సిఎం స్వయంగా ప్రకటించారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు అంశంకూడా అదే పరిస్థితిలో ఉంది.

ఐదు సీజన్లలో రైతులను వేధించిన కరవు..
ఈ మూడేళ్లలో గత రబీ మినహా మిగతా ఐదు సీజన్లలో రైతుల్ని కరువు విపరీతంగా వేధించింది. మొదటి ఏడాదిలో కరవును రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. రెండో ఏడాది కరవు మండలాలు ప్రకటించినా ఇప్పటికీ కరువు సాయం అందించలేదు. కేంద్రం మంజూరు చేసిన 13వందల కోట్ల రూపాయలూ రైతన్నలకు ఇవ్వడానికి ముందుకు రాలేదు.. కరవు సాయంతోపాటు ప్రకృతి వైపరిత్యాల పరిహారం పంపిణీలోనూ ఇదే దారిలో సాగుతోంది.. రైతులకు ఎకరాకు 4వేల రూపాయలు ఇస్తామన్న హామీకూడా ఎన్నికల జిమ్మిక్కేఅంటున్నారు రైతు సంఘాల నేతలు. ఇలా రైతన్నలకు ఎన్నో చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. వాస్తవానికి రైతులకు మొండిచేయే చూపిస్తోంది. వ్యవసాయానికి మాటల్లోనే సాయం అందిస్తూ చేతల్లో చతికిలబడుతోంది.

Don't Miss