యాదాద్రి ఆలయ విస్తరణ శరవేగంగా పనులు

12:34 - September 3, 2017

యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆలయ విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాకతీయుల నైపుణ్యం ఉట్టిపడేలా శిల్పకళతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మరో ఏడు నెలల్లో ప్రధాన ఆలయాన్ని పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో అధికారులున్నారు. 

దక్షిణ భారతదేశంలోనే యాదగిరి గుట్టను సుందర ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేదుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు యాదగిరి గుట్ట దేవస్థానం అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్ఠి సారించింది. అందులో భాగంగానే 1975 జీవో 47 ప్రకారం యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసి, చట్టపరమైన హోదా కల్పించింది. స్వయంగా ముఖ్యమంత్రే ఈ అథారిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆలయ అభివృద్ధి కోసం అథారిటీ 1800 కోట్లతో ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు 300 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిది. ముఖ్యమంత్రి, చిన్నజీయర్‌ స్వామితో కలిసి ఆలయ నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. అగమశాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణం చేసేలా పేరొందిన శిల్పులను రప్పించి దేవాలయ అధునాతన డిజైన్‌ను తయారు చేశారు. చారిత్రక, ధార్మిక, సాంస్కృతిక ఔన్నత్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. 

దేవాలయం ప్రాంతంలో అభివృద్ధి కోసం కొండపై ఉన్న సుమారు 14 ఎకరాల స్థలంలో ఆలయ విస్తరణ చేయనున్నారు. కొండపై రిటెయినింగ్‌ వాల్‌ ఇతర సివిల్‌ పనులు చేసేందుకు ఇప్పటికే మెన్సర్‌ సన్‌ షైన్‌ సంస్థతో అథారిటీ ఒప్పందం కుదుర్చుకుంది. దేవాలయం పునర్‌నిర్మాణంలో ఆగమ శాస్త్రం, వాస్తు శాస్త్రం, పంచరాత్రాగమ శాస్త్రాలతో గుడి డిజైన్లకు రూపకల్పన చేశారు. శిల్ప, కళా ఖండాల చట్టం విధివిధానాలకు అనుగుణంగా ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ మెన్సర్స్‌ ఈవెంట్‌ ప్రతినిధి అనంత సాయి ప్రత్యేక డిజైన్‌ను రూపొందించారు. రీడిజైనింగ్‌ పనులు ప్రారంభించిన తర్వాత స్వామి వారికి నిత్యం పూజలు నిర్వహించేందుకు బాల ఆలయాన్ని ఏర్పాటు చేశారు. 

ఆలయ నిర్మాణంలో గోపురాలకు సంబంధించి బృహత్‌ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి కావచ్చాయి. గుంటూరు చరిజెపల్లి క్యారీకి చెందిన నల్ల రాయితీతో అల్వారీ మండప నిర్మాణం పనులు చేస్తున్నారు. మరో రెండు నెలల్లో మండపానికి సంబంధించిన కళా ఖండాల రూపకల్పన పూర్తికానుంది. దేవాలయ ప్రాంగణంలో 7 రాజగోపురాలు, ఆల్వార్‌ మండపంతో పాటు దేవాలయ ప్రాంగణంలో నరసింహుడి చరిత్ర తెలిపేలా ప్రధాన ఘట్టాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 500 మంది కళాకారులను నియమించారు. 8 నెలల కాలంలో 24 పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. 

ప్రముఖ శిల్పి సుందర్ రాజన్‌ నేతృత్వంలో కళాకారులు...ఆల్వారీ మండపాల నిర్మాణం దాదాపుగా పూర్తి చేశారు. ఆరు నెలల్లో దేవాలయ ప్రధాన కళాఖండాల నిర్మాణం పూర్తికానుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ఇందుకోసం 800 ఎకరాలను సేకరించారు. మొదటి దశలో భాగంగా 250 ఎకరాల్లో టెంపుల్‌ అథారిటీ కాటేజీల నిర్మాణం పూర్తి చేసింది. మరో 250 ఎకరాల్లో 200 విఐపీ కాటేజీలు నిర్మించబోతోంది. టెంపుల్‌ సిటీలో కాటేజీల నిర్మాణం కోసం దేవస్థానం డోనర్‌ పథకాన్ని ఆహ్వానించింది. కాటేజీ నిర్మాణంలో భాగస్వాములైన వారిని అథారిటీ నియమ నిబంధనల ప్రకారం కాటేజీ నిర్మాణ, నిర్వాహణా బాధ్యతలను అప్పగించనుంది. 

యాదాద్రిలో మొత్తం తొమ్మిది కొండలు ఉన్నాయి. ఇందులో 3 కొండలను పూర్తిగా దేవాలయం పునర్నిర్మాణం కోసం వినియోగిస్తున్నారు. గర్భగుడి ఉన్న కొండను ఏమాత్రం కదల్చకుండా మిగిలిన రెండు గుట్టలపై అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. కళ్యాణ మండపం, బస్టాండ్‌, కార్‌ పార్కింగ్‌, సెంట్రల్‌ రిజర్వేషన్‌ ఆఫీస్‌ ఫైర్‌ స్టేషన్‌, స్వామి వారి ఉద్యానవనం, అర్చక అగ్రహారం నిర్మాణాలను 250 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. 

గిరి ప్రదక్షిణుడిగా పేరున్న లక్ష్మీ నరసింహా స్వామి వారి భక్తుల కోసం కొండ చుట్టూ 100 అడుగులతో సర్క్యులర్‌ రోడ్డును ఏర్పాటు చేయనున్నారు. టెంపుల్‌ సిటీలో నీటి ఎద్దడి లేకుండా మిషన్‌ భగీరథ పథకం కింద భారీ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారు. సుమారు 5 లక్షల లీటర్ల నీటి ఉత్పత్తికి ప్రాజెక్టును రూపకల్పన చేశారు. నూతన హంగులతో నిర్మిస్తున్న దేవాలయం పునర్‌ నిర్మాణం కావాలంటే మరో 500 కోట్ల బడ్జెట్‌ అవసరమంటున్నారు ఆలయ అధికారులు. వచ్చే ఏడాది యాదాద్రి బ్రహ్మోత్సవాలనాటికి ఆలయ పనులు పూర్తికావస్తాయని దేవాలయ అథారిటీ నిర్వాహకులు చెబుతున్నారు. 

Don't Miss