టెన్ టివి ఎఫెక్ట్

07:31 - August 31, 2017

వరంగల్ : వరంగల్‌లోని నిట్‌లో జరుగుతున్న డ్రగ్స్‌ దందాపై అధికారయంత్రాంగం కదిలింది. 10టీవీ వరుస కథనాలతో ఎట్టకేలకు అధికారుల్లో చలనం వచ్చింది. నిట్‌లో డ్రగ్స్‌ భూతంపై 10టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. డ్రగ్స్‌ భూతాన్ని తరిమివేసేందుకు అక్షర యజ్ఞం చేసింది. విశ్వవిద్యాలయాల్లో చాపకింద నీరులా వ్యాపిస్తోన్న డ్రగ్స్‌ విషబీజాలను మొగ్గలోనే తుంచివేసేందుకు సామాజిక సమరం చేసింది. అందుకే డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వరుస కథనాలను ప్రసారం చేసింది. దీంతో అధికారులు స్పందించి నిట్‌లో డ్రగ్స్‌ మాఫియా గుట్టురట్టు చేశారు.

ఇద్దరు విద్యార్థుల అరెస్ట్‌
ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, పోలీసులు, రైల్వే జీఆర్‌పీ రంగంలోకి దిగింది. అమాయక విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠా సభ్యులను పట్టుకున్నారు. గుట్టుగా సాగుతున్న డ్రగ్స్‌ ముఠా గుట్టును రట్టు చేశారు. నిట్‌ హాస్టల్‌ గదులను తనిఖీలు చేసి... కీలక సమాచారం సేకరించారు. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. ఐదు ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌ స్ట్రిప్స్‌తోపాటు ఓ ల్యాప్‌టాప్‌, రెండు సెల్‌ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిట్‌లో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న రమేష్‌, ఎలక్ట్రానికస్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న ద్విజ్‌ ఇద్దరూ స్నేహితులు. వన్‌ కె హాస్టల్‌లో ఉంటున్న రమేష్‌ - ద్విజ్‌ కొంతకాలంగా డార్క్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఎల్‌ఎస్‌డీ దిగుమతి చేసుకుంటున్నారు. వాటిని అమాయక విద్యార్థులకు అంటగడుతున్నారు.

రెడ్‌ హ్యాండెడ్‌గా
నిట్‌ సమీపంలో వీరిద్దరూ డ్రగ్స్‌ విక్రయిస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సురేష్‌ రాథోడ్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో డ్రగ్స్‌ కొనుగోలు చేసిన విద్యార్థులు... కొత్తపేటలో కొరియర్‌ ద్వారా వాటిని దిగుమతి చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. మెట్రో నగరాలకే పరిమితమైన డ్రగ్స్‌ వ్యవహారం వరంగల్‌లో వెలుగు చూడడం కలకలం సృష్టించింది. దేశానికి ఎంతోమంది మేథావులను అందించిన జాతీయ సాంకేతిక విద్యాసంస్థ విద్యార్థులు పట్టుబడటం క్యాంపస్‌లో హాట్‌టాఫిక్‌గా మారింది.

Don't Miss