టెన్ టివి ఎఫెక్ట్

19:45 - September 6, 2017

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనం అంటే భక్తులకు ఎంతో ఇష్టం. ఆ తల్లి దర్శనం చేసుకుంటే.. అంతా మంచే జరుగుతుందని ఓ నమ్మకం. కానీ దేవస్థానంలో అంతరాలయ దర్శనం టికెట్‌ ధరలు ఎక్కువగా నిర్ణయించడం.. భక్తులను ఇబ్బందుల్లోకి నెట్టింది. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో నెలకొన్న వివాదాల విషయంలో.. ఇప్పుడిప్పుడే చిక్కుముడులు వీడుతున్నాయి. దుర్గమ్మ దర్శనం టికెట్‌ ధరలు కాస్ట్‌లీ అంటూ గతంలో 10టీవీ కథనాలు ప్రసారం చేసింది. దర్శనం టికెట్ల ధరలు పెరగడంతో గుడికి భక్తుల రాక తగ్గింది. దీంతో ఆలయ ఆదాయానికి గండి పడింది.

10 టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది
దుర్గమ్మ దేవాలయంలో ఉన్న సమస్యలను 10 టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే పాలక మండలి కూడా అమ్మ దర్శనం టికెట్లు తగ్గించేందుకు ప్రయత్నాలు చేసింది. దర్శనం టికెట్ల విషయంలో ఉన్న ఇబ్బందులను మంత్రికి తెలిపింది. మంత్రి దేవినేని ఉమ టికెట్ల ధరలను తగ్గించాలని ఈవో సూర్యకుమారిని కోరారు. అందుకు ఆమె వీలుపడదని చెప్పడం, మంత్రి ఆలోచిస్తాననడంతో వివాదం తార స్థాయికి చేరింది. ఈ విషయంపై ఆలయంలో పంచాయతీ జరగడం గురించి కూడా 10 టీవీ కథనాలు ప్రసారం చేసింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఆలయంలో జరుగుతున్న రాద్దాంతంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. వెంటనే ఆలయ అధికారులు, ఈవో, పాలక మండలికి మధ్య నెలకొన్న విబేధాలపై సీరియస్‌ అయ్యారు. ప్రభుత్వం కూడా దర్శనం టికెట్ల గొడవపై.. ఆరుగురు సభ్యులతో తాత్కాలికంగా కమిటీని నియమించారు. ఈ కమిటీలో గౌరంగబాబు, ఈవో సూర్యకుమారి, ఇద్దరు సభ్యులతో పాటు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ను నియమించారు.

300 నుంచి 150 రూపాయలకు తగ్గించాలని తీర్మానం
సెప్టెంబర్‌ 4న దేవస్థానంలో ఆలయ చైర్మన్‌ గౌరంగబాబు, ఈవో సూర్యకుమారి ఆధ్వర్యంలో.. పాలకమండలి సమావేశం నిర్వహించారు. దర్శనం టికెట్‌ ధరను 300 నుంచి 150 రూపాయలకు తగ్గించాలని తీర్మానించారు. అలాగే 100 రూపాయలున్న ముఖ మండప దర్శనం టికెట్‌ ధరను కూడా.. 50 రూపాయలకు తగ్గించాలని తీర్మానం చేశారు. ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపారు. మొత్తానికి 10 టీవీ వరుస కథనాలతో అధికారుల్లో చలనం వచ్చింది. దీంతో భక్తులు ఎంతగానో సంతోషిస్తున్నారు. 

 

Don't Miss