తెల్లరాయిని తరలించేస్తున్నారు...

06:37 - April 15, 2018

విజయవాడ : తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో మాఫియా చెలరేగి పోతోంది. కొండలు, కోనలు, నదులు ఇలా అన్నంటిని వరుసబెట్టి మింగేస్తోంది. అక్రమంగా తవ్వకాలు జరుపుతూ మాఫియా సొమ్ముచేసుకుంటోంది. ప్రకృతి సంపదను అక్రమార్కులు కొల్లగొడుతోంటే.. అధికారులు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తూర్పు ఏజెన్సీలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై 10టీవీ కథనం...తూర్పు ఏజెన్సీ విలువైన మైనింగ్‌కు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు ఆ మైనింగ్‌పైనే మాఫియా కన్నేసింది. ప్రకృతి సంపదను కొల్లగొట్టేందుకు ప్లాన్‌ వేసింది. అక్రమంగా తవ్వకాలు జరుపుతూ ప్రకృతి సంపదైన మైనింగ్‌ను తరలించుకుపోతోంది. కూనవరం మండలం బొదనూరులో అక్రమ తవ్వకాలు యథేచ్చగా సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కొంతమంది కాంట్రాక్టర్లు సహజ సంపదను దోచుకుంటున్నారు. లక్షల విలువచేసే తెల్లరాయిని గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు.

తూర్పు ఏజెన్సీ నుంచి అక్రమంగా తరలిస్తున్న సున్నపురాయి టన్నుకు పదివేల రూపాయల వరకు పలుకుతుంది. దీంతో అక్రమార్కులకు మైనింగ్‌ వరంగా మారింది. ప్రకృతి సిద్దంగా ఏర్పడిన ఖనిజ సంపదపై కన్నేసిన మాఫియా.. అక్రమాలకు తెరలేపుతోంది. గుట్టుచప్పుడు కాకుండా సున్నపురాయిని తరలించేస్తోంది. తాడేపల్లిగూడేనికి చెందిన ఓ పొలిటికల్‌ లీడర్‌ సాయంతో సున్నపురాయిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. బొదునూరులో 500 టన్నులు, ఏటపాక మండలం కొత్తూరులో మరో 500 టన్నుల తెల్లరాయి రవాణాకు సిద్ధంగా ఉంచారు.

తెల్లరాయిని గుట్టుచప్పుడు కాకుండా అక్రమార్కులు రాష్ట్రాలు దాటిస్తోంటే అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై తహసీల్దార్‌ను వివరణ కోరగా... సున్నపురాయి తరలింపుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్తున్నారు. సున్నపురాయిని రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తూ సొమ్ముచేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Don't Miss