ఎడారిలో జలధార

18:39 - November 13, 2017

జైపూర్ : రాజస్థాన్‌..! ఇది ఎడారి బతుకుల తావు. అక్కడి ప్రజలవి.. వాన చినుకుపై ఆశతో సాగే బతుకులు.. గుక్కెడు నీటి కోసమూ మైళ్ళ దూరం నడవక తప్పని వెతలు.. పచ్చందనాల సంగతి సరేసరి.. కనీసం మూగజీవాలకు కూసింత గడ్డి దొరకడమూ దుర్లభమే. ఇసుక తుఫాను హోరు తప్ప.. జలకళ మచ్చుకైనా కానరాదక్కడ. ఇదీ రాజస్థాన్‌ గురించి మనకు తెలిసిన విషయం. కానీ, నేడు అక్కడి పరిస్థితి పూర్తిగా దీనికి భిన్నం. ఎడారి నేలలోంచి నాలుగడుగులకే గంగమ్మ ఉబికి ఉబికి వస్తోంది. ఇదెలా సాధ్యమైంది..? ఎడారి నేల జలసిరులకు కారణమేంటి..? ఈ ప్రశ్నలకు సమాధానమే.. 10టీవీ గ్రౌండ్ రిపోర్ట్‌.

దేశంలోనే అత్యధిక ఎడారి ప్రదేశమున్న రాష్ట్రం రాజస్థాన్‌...! దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జైసల్మేర్‌ ఉన్న రాష్ట్రమూ ఇదే..! ఇక్కడి జీవనం.. ముఖ్యంగా గ్రామీణ జనజీవనం అత్యంత దుర్భరం. కడుపునిండా తిండి మాట అటుంచి.. గుక్కెడు నీటితో గొంతు తడుపుకుందామన్నా వీలుకాని దయనీయ జీవనం. 

ఏటికేడు తగ్గుతోన్న వర్షపాతం.. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం..నానాటికీ అడుగంటిపోతున్న భూగర్భ జలం.. గుక్కెడు తాగునీటికీ మైళ్ల దూరం నడవాల్సిన దైన్యం..ఇదీ నిన్నటి దాకా రాజస్థాన్‌ రాష్ట్ర ముఖ చిత్రం. భారత భూభాగంలో రమారమి పది శాతం కలిగిన పెద్ద రాష్ట్రం. పర్యటకులను ఆకట్టుకునే దుర్భేద్యమైన కోటలు, గ్రానైట్‌ పరిశ్రమలు.. ఎత్తైన కొండలతో కాన్వాస్‌పై అందంగా చిత్రించినట్లుండే రాజస్థాన్‌లో.. గ్రామీణ జీవనం దుర్భరం.  

జైపూర్, జోధ్ పూర్, ఉద‌య్ పూర్, బిక‌నీర్, కోటా, అజ్మీర్... ఇలా కొన్ని ప‌ట్ణాణాలను మిన‌హాయిస్తే..  అక్కడొకటి, ఇక్కడొక్కటి అన్నట్లుగా ఉండే ఊర్లు.. విసిరేసినట్లుగా ఉండే జనావాసాలు.. గిరిజ‌న గూడేలు.. ఇవన్నీ తీవ్ర వర్షాభావానికి సజీవ సాక్ష్యాలు. ఈ ప్రాంతంలోని గ్రామాలన్నీ గుక్కెడు నీటికోసం కటకటలాడేవే. తాగునీటి కోసం కిలోమీటర్ల మేర దూరం సాగక తప్పని దైన్యం వీరిది. ఇక మూగ‌జీవాల సంగ‌తి చెప్పక్కర్లేదు. ప‌చ్చిక లేక డొక్కలు ఎండిన పశువులే కనిపిస్తాయిక్కడ. ఉపాధి పరిస్థితీ అంతంతే. పనులు వెతుక్కుంటూ వలస వెళ్లిన వారు వెళ్లగా.. ఉన్నవారికి ఉపాధి కనిపించని దయనీయ స్థితి. 

తడారి ఎండిన నేలలు.. దప్పికతో అల్లార్చుకుపోతున్న గొంతుకలు.. శోషించి శుష్కించిన దేహాలు.. రాజస్థాన్‌ గ్రామీణంలో ఎక్కడ చూసినా ఇవే చిత్రాలు.. గుండెలను బరువెక్కించే దృశ్యాలు..
మారుతోన్న రాజస్థాన్‌ కరవు చిత్రం..
ఎడారి బతుకుల్లో చిగురిస్తోన్న కొత్త ఆశలు..
నిత్య క్షామపీడిత రాజస్థాన్‌ రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో.. ఇప్పుడిప్పుడే కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దశాబ్దాల క్షామానికి చరమగీతం పాడే దిశగా బృహత్తరమైన అడుగులు పడుతున్నాయి. ఎండిన గొంతుకు నీటిని, పొడిబారిన నేల‌కు గంగ‌మ్మ పరుగులను  అందించే ప‌క్కా ప్రణాళిక‌కు శ్రీకారం చుట్టింది అక్కడి ప్రభుత్వం. ఫలితంగా.. నిన్నటి ఎడారి.. నేడు సస్యాన్ని నింపుకుంటోంది. గ్రామీణుల దాహార్తీ తీరుతోంది. 
మారుతోన్న రాజస్థాన్‌ కరవు చిత్రం..
మారుతోన్న రాజస్థాన్‌ కరవు చిత్రం.. ఎడారి బతుకుల్లో చిగురిస్తోన్న కొత్త ఆశలు.. రాజస్థాన్‌ ప్రజలకు వరదాయినిగా ఎంజేఎస్‌ఏ... చతుర్విధ జల సంరక్షణకు నడుం బిగించిన ఎంజేఎస్‌ఏ..అనతి కాలంలోనే జలసిరులను అందిస్తోన్న అద్భుత ఫలితాలు..

అవును..! కరవుతో కునారిల్లిన రాజస్థాన్‌లో నేడు జలసిరులు పొంగుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రణాళిక సఫలమై.. అక్కడ భూగర్భజలాలు గణనీయంగా వృద్ధి చెందాయి. తెలుగు బిడ్డ వెదిరె శ్రీరాం నేతృత్వంలోని ఎంజేఎస్‌ఏ.. విశేష కృషితో.. ఇక్కడ అద్భుత ఫలాలు సాధ్యమవుతున్నాయి. 

సాగు, తాగునీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగిన రాజస్థాన్‌ ప్రభుత్వం.. భూమిపై పడ్డ ప్రతి చినుకునూ ఒడిసిపట్టుకునేందుకు చతుర్విధ జలసంరక్షణ విధానానికి శ్రీకారం చుట్టింది. రాజస్థాన్‌ రివర్‌ బోర్డ్‌ అథారిటీ సూచనల మేరకు, "ముఖ్యమంత్రి జల స్వావలంబన్‌ అభియన్‌" పథకాన్ని రూపొందించింది. రివర్‌ బోర్డ్‌ అథారిటీ చైర్మన్‌గా ఉన్న తెలుగుబిడ్డ, నల్లగొండ జిల్లా వాసి, వెదిరె శ్రీరాంకు క్యాబినెట్‌ హోదాను కల్పిస్తూ.. చతుర్విధ జల సంరక్షణ బాధ్యను అప్పగించారు ముఖ్యమంత్రి వసుంధరరాజె సింధియా. ముఖ్యమంత్రి జల స్వావలంబన్‌ అభియన్‌-ఎంజేఎస్‌ఏ, జలసంరక్షణ బాధ్యతలు చేపట్టగానే విప్లవాత్మక విధానాలకు శ్రీరారం చుట్టింది. 
ఇంతకీ చతుర్విధ జల సంరక్షణ విధానాలు ఏంటి..? 
ఇంతకీ చతుర్విధ జల సంరక్షణ విధానాలు ఏంటి..? వాటిని ఏ ప్రాతిపదికన.. ఎలా అమలు చేస్తున్నారు..? ఈ విధానం అందించిన ఫలాలు ఏంటి..? జనవరి 2016లో.. ఎంజేఎస్‌ఏ, చతుర్విధ జల సంరక్షణ విధానానికి శ్రీకారం చుట్టింది. వాన నీటి ప్రవాహ వాలు వెంబడి.. కందకాలు, మట్టికట్టలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించడం.. చిన్నపాటి చెరువులు తవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ విధానంలో నేలపై పడ్డ ప్రతి నీటి చినుకునూ ఒడిసి పట్టి నిల్వ చేస్తున్నారు. 

చతుర్విధ జల సంరక్షణ విధానం వల్ల.. రాష్ట్రంలోని 250 డార్క్ జోన్లలో .. 150 జోన్‌లు ఇప్పుడు ఫ్రీ జోన్లుగా మారిపోయాయి. నిన్నటి వ‌ర‌కూ వెయ్యి అడుగుల లోతులో నేలను తవ్వినా నీరు వెలికి వచ్చేది కాదు. ఇప్పుడు కేవలం పదంటే పది అడుగులు తవ్వితే చాలు.. పాతాళ గంగమ్మ ఉబికి ఉబికి వస్తోంది. 

ముఖ్యమంత్రి జల స్వావలంబన అభియాన్‌-ఎంజేఎస్‌ఏని గడచిన 22 నెలల్లో మూడు దశలుగా అమలు చేశారు. ఇప్పటి వరకూ 2 లక్షల 50వేల స్ట్రక్చర్లను పూర్తి చేశారు. నాణ్యతకు, పాదర్శకతకు పెద్దపీట వేస్తూ.. ప్రతి పనికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నారు. జియోట్యాగింగ్‌ ద్వారా వ్యవస్థను అనుసంధానించి పర్యవేక్షిస్తున్నారు. 

ఎంజేఎస్‌ఏ.. ఏదో ప్రభుత్వ పథకం.. అధికారులే చేసుకుపోతారు అన్న భావనకు చెక్‌ చెబుతూ.. ప్రభుత్వం, శ్రమదానం ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఇందులో మమేకం చేసింది. విద్యార్థి, కుల, మత సంఘాలతో పాటు, స్వచ్చంద సంస్థలనూ భాగస్వాములను చేసింది. ప్రజల్లో బాధ్యతను పెంచడంతో పాటు.. ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గేందుకూ శ్రమదానం ఉపకరించింది. అంతేకాదు.. పచ్చదనాన్ని పెంచేందుకు కోటి మొక్కలనూ నాటించింది. ఈ మొక్కలను జియో ట్యాగింగ్‌ ద్వారా అనుసంధానించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ద్వారా పర్యవేక్షిస్తోంది. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయి.     

మొత్తానికి రాజస్థాన్‌ ప్రభుత్వం చేపట్టిన సీఎం జల్‌ స్వావలంబన్‌ అభియాన్‌తో, రాజస్థాన్‌లో పడ్డ ప్రతి చినుకూ ఆదా అవుతోంది. జనవరి 2016లో ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటి వరకు రెండు దశల్లో ఎనిమిది వేల గ్రామాల్లో పనులు పూర్తి చేశారు. మూడవ దశ కింద మరో నాలుగు వేల గ్రామాల్లో పనులు కొనసాగిస్తున్నారు. 
2016లో ఎంజేఎస్‌ఏ, చతుర్విధ జల సంరక్షణ విధానానికి శ్రీకారం 
రాజస్థాన్‌ ఎడారి బతుకుల్లో కొత్త ఆశలు చిగురింప చేస్తోంది.. తెలుగుబిడ్డ వెదిరె శ్రీరాం అమలు చేస్తోన్న ఫోర్‌ వాటర్‌ స్కీమ్‌. చతుర్విధ జల సంరక్షణ ప్రక్రియతో అద్భుతాలు సృష్టిస్తూ.. అక్కడి ప్రజల గొంతు తడపడమే కాదు.. దశాబ్దాలుగా బీడువారిన భూముల్లో పచ్చని చివుళ్లను మొలిపిస్తున్నారు. రాజస్థాన్‌ బీడు భూముల్లో జల సంరక్షణ ప్రక్రియ అమలు తీరుపై 10టీవీ ప్రతినిధి కొండల్‌ అందిస్తోన్న గ్రౌండ్‌ రిపోర్ట్‌.. 

రాజస్థాన్‌..! ఇది ఎడారి బతుకుల తావు. అక్కడి ప్రజలవి.. వాన చినుకుపై ఆశతో సాగే బతుకులు.. గుక్కెడు నీటి కోసమూ మైళ్ళ దూరం నడవక తప్పని వెతలు.. పచ్చందనాల సంగతి సరేసరి.. కనీసం మూగజీవాలకు కూసింత గడ్డి దొరకడమూ దుర్లభమే. ఇసుక తుఫాను హోరు తప్ప.. జలకళ మచ్చుకైనా కానరాదక్కడ. ఇదీ రాజస్థాన్‌ గురించి మనకు తెలిసిన విషయం. కానీ, నేడు అక్కడి పరిస్థితి పూర్తిగా దీనికి భిన్నం. ఎడారి నేలలోంచి నాలుగడుగులకే గంగమ్మ ఉబికి ఉబికి వస్తోంది. ఇదెలా సాధ్యమైంది..? ఎడారి నేల జలసిరులకు కారణమేంటి..? ఈ ప్రశ్నలకు సమాధానమే.. 10టీవీ గ్రౌండ్ రిపోర్ట్‌.

చతుర్విధ జల రక్షణ విధానంతో ప్రతి వాన చుక్కనూ లెక్క కడుతూ కాపాడుకుంటూ భూగర్భ జలాలను పెంచుకుంటూ.. తాగు, సాగు నీటి ఇబ్బందులను దూరం చేస్తున్నారు. ఇలాంటి పథకాలను తెలుగు రాష్ట్రాల్లోని కరవు ప్రాంతాల్లోనూ అమలు చేస్తే.. పచ్చందనాలు వెల్లివిరుస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 

Don't Miss