కోటలకు చిరునామా రాజ‌స్థాన్‌

16:48 - November 12, 2017

జైపూర్ : ఎత్తైనా కట్టడాలు...! కనువిందు చేసే శిల్పాలు...! ఆహ్లాదకర పరిసరాలు..! కట్టిపడేసే అందాలు.. కలగలిస్తే.. రాజస్థాన్‌ కోటలు. భారత దేశ సంస్కృతికి... శిల్ప కళా ఔచిత్యానికి... ఆనవాళ్లు రాజస్థాన్‌ దుర్గాలు..! కొన్ని వేల సంవత్సరాల  చరిత్రకు.. చెక్కు చెదరని చిహ్నాలు ఈ రాజసౌధాలు..!   రాచరిక దర్పాన్ని చాటుతూ.. ఒకనాటి... మేధో శ్రమను, కళాత్మకతను నేటి తరానికి పరిచయం చేస్తున్న రాజస్థాన్‌ కోటలపై 10టీవీ ప్రత్యేక కథనం  
కోటలు, అరుదైన కట్టడాలు
రాజస్థాన్‌...! కోటలకు.. అరుదైన కట్టడాలకు... చిరునామా. రాచరిక వ్యవస్థను పట్టిచూపించే.. ఆనవాళ్లెన్నో ఇక్కడ దర్శనమిస్తాయి. రాజుల భవంతులను... వారి యుద్ధగాధలను.. అప్పటి కళానైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే.. రాజస్థాన్‌ సందర్శిస్తే చాలు.. 
అమీర్‌పోర్ట్‌..
ఇదిగో ఇక్కడ చూడండి... అందచందాలలో తనతో తానే.. పోటీ పడినట్టు ఉన్న.. ఈ కోట పేరు అమీర్‌పోర్ట్‌.. దీనినే అమీర్‌ ఫ్యాలెస్‌ అని కూడా అంటారు. జైపూర్‌కు దగ్గరల్లో అమీర్‌ అనే ప్రాంతంలో ఉండడంతో దీనికి అమీర్‌పోర్ట్‌ అనే పేరు వచ్చింది. 1550 నాటి రాజు రాజా మాన్‌సింగ్‌ దీనిని నిర్మించారు. సరస్సుకు ఎదురుగా... ఎత్తైన కొండపై శాండ్‌ స్టోన్‌.. మార్బుల్స్‌తో నిర్మించిన ఈ కోటను చూస్తే... ఔరా అనాల్సిందే.. చెక్కు చెదరని ఆర్కిటెక్ట్‌ ఈ ప్యాలెస్‌ సొంతం. ప్రజా దర్బార్‌, రాజు ఆంతరంగిక మందిరాలు.. పూర్తిగా అద్దాలతో నిర్మించిన శీశ్‌ మహల్‌ అందాలు  ఎంత చూసినా తనివి తీరదు. 
ఏడో శతాబ్దంలో నిర్మించిన చిత్తోడ్‌గఢ్‌ కోట
ఇక ఏడో శతాబ్దంలో నిర్మిచిన చిత్తోడ్‌ గఢ్ కోట  ఇప్పటికీ తన రాజసాన్ని చాటుకుంటోంది. భూమికి 590 అడుగుల ఎత్తులో... 280 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కోట అరుదైన కట్టడమనే చెప్పాలి.. కోటలోని మీరా టెంపుల్‌, కీర్తి స్తంభం, జైన్ మందిర్‌లకు రాతిపై వాడిన డిజైన్స్‌ ఇప్పటికి అబ్బురపరుస్తున్నాయి. పద్మిని ప్యాలెస్‌.. రాజా రతన్‌ సింఘ్‌, రాణి పద్మిని- అల్లావుద్దిన్‌ ఖీల్జీల మధ్య జరిగిన పోరాటాలకు ఈ కోట సజీవ సాక్షిగా నిలుస్తోంది.
హవా మహల్‌ 
జైపూర్‌లో ఉండే హవా మహల్‌ రాజపుత్రుల కళాభిరుచికి, నాటి కళా వైభవానికి అద్దం పడుతూ... పర్యాటకులకు కనువిందు చేస్తోంది. అలాగే కళ్లను తిప్పుకోనివ్వని జల్‌మహల్‌...మరో ప్రత్యేకం. మూడు వందల ఎకరాల విస్తీర్ణంలోని చెరువు మధ్య కనువిందు చేసే అద్భుతమైన కళాకండమే జల్‌మహల్‌. అలాగే ఉదయ్‌పూర్‌లో లేక్‌ ప్యాలెస్‌ చూపరులను ఆకట్టుకుంటుంది. 
ల్యాండ్‌ ఆఫ్‌ కింగ్స్‌..రాజస్థాన్‌
ఇవే కాదు.. జనాగఢ్‌ కోట, బికనీర్‌ మహరాజు నిర్మించిన ప్యాలెస్‌లు ఇలా రాజస్థాన్‌లో ఏ మూలకు వెళ్లినా.. చరిత్రకు సాక్ష్యాలు దర్శనమిస్తూనే ఉంటాయి. ఇవన్నీ చూస్తే.. అందుకేనా చరిత్రకారులు రాజస్థాన్‌ను ల్యాండ్‌ ఆఫ్‌ కింగ్స్‌గా అభివర్ణిస్తారు..  అని అనిపించక మానదు. 

 

Don't Miss