నేలకొరిగిన కమ్యూనిష్టు మహాశిఖరం...

19:01 - November 26, 2016

క్యూబా : కమ్యూనిస్టు మహాశిఖరం నేలకొరిగింది. జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతాల కోసం పాటుపడిన క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్‌ క్యాస్ట్రో తుదిశ్వాస విడిచారు. 90ఏళ్ల కమ్యూనిస్టు కురువృద్ధుడు క్యాస్ట్రో అనారోగ్యంతో కన్నుమూశారు. పేదల మణిదీపం క్యాస్ట్రో మరణంతో క్యూబా ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. 
మహోన్నత శక్తి ఫెడరల్‌ క్యాస్ట్రో 
ఫెడరల్‌ క్యాస్ట్రో.... ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు. ఆ పేరు వినగానే మనలో ఏదో తెలియని ఉత్సాహం ఉరకలేస్తుంది. అమెరికా సామ్రాజ్యవాదాన్ని పాతరేయమని గుర్తు చేస్తుంది. అంతేకాదు.. పీడిత ప్రజలపై సాగే దోపిడీకి వ్యతిరేకంగా పోరాడమని పిలుపునిస్తుంది. అంతటి మహోన్నత శక్తి ఫెడరల్‌ క్యాస్ట్రో పేరుకుంది. 
అమెరికా సామ్రాజ్యవాదాన్ని సవాల్‌ చేసిన క్యూబా
ఫెడరల్‌ క్యాస్ర్టో క్యూబాకు సుదీర్ఘకాలంపాటు దేశాధ్యక్షుడిగా పనిచేశారు.  1959 నుంచి 1976 వరకు ప్రధానిగా పనిచేశారు.  1976 నుంచి 2008 వరకు క్యూబాకు అధ్యక్షునిగా విశేషమైన సేవలందించారు. క్యాస్ట్రో సారధ్యంలోనే క్యూబా అన్ని రంగాల్లో ఊహించని ప్రగతి సాధించింది.  క్యూబా దేశం ఆర్దికంగా బలమైన శక్తిగా ఎదిగింది.  అంతేకాదు.. అమెరికాకు పక్కలో బల్లెంలా తయారయ్యింది. అమెరికాతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి క్యూబా ఎదిగిందంటే.. అందుకు తెరవెనుక నాయకుడు క్యాస్ట్రో అని  చెప్పక తప్పదు. క్యూబా అధ్యక్షుడిగా దేశానికి ఫిడెల్‌ మార్గనిర్దేశనం చేశారు.  క్యాస్ట్రో ఉక్కుసంకల్పం, పట్టుదల, అంకుఠిత దీక్షతో క్యూబా అనతికాలంలోనే  ఎనలేని శక్తిగా ఎదిగింది. అమెరికా సామ్రాజ్యవాదాన్ని సవాల్‌ చేసి ఎదురునిలిచింది.
యుక్తవయసులో విప్లవ భావాలు
ఫిడెల్‌ క్యాస్ట్రో అసలు పేరు ఫిడెల్‌ అలెజాండ్రో క్యాస్ట్రో రూజ్‌. 1926 ఆగస్టు 13న బిరాన్‌లోని హోల్గిన్‌లో ఆయన జన్మించారు. చిన్నప్పటి నుంచే క్యాస్ట్రోలో నాయకత్వ లక్షణాలు ఉండేవి. విప్లవ భావాలు యుక్తవయసులోనే  అలవడ్డాయి. అప్పుడే అమెరికా సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా నిరసించారు క్యాస్ట్రో.  మొదటి నుంచి విప్లవ భావాలు కలిగిన ఫిడెల్‌.. హవానా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.  సామ్యవాద భావాలతో బలమైన బంధం ఏర్పర్చుకున్న ఫిడెల్‌ తమ్ముడు రౌల్‌ క్యాస్ట్రోతో కలిసి 1953లో అప్పటి క్యూబా మిలిటరీ నియంత పుర్జెసియా బటిస్టాపై దాడికి తెగబడ్డారు.  ఈ దాడిలో తమ్ముడితో కలిసి బందీగా చిక్కిన క్యాస్ట్రో... 15ఏళ్ల కారాగార శిక్ష  ఎదుర్కొని బయటకు వచ్చారు.  ఆ తర్వాత తన తమ్ముడు  రౌల్, మరో విప్లవ యోధుడు చేగువేరాతో పాటు ఎంతోమంది యువతను చేరదీసి, గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇచ్చారు. క్యూబాలో విప్లవోద్యమాన్ని రగిల్చి  1959, జనవరి 9న  నాటి బటిస్టా ప్రభుత్వాన్ని గెరిల్లా యుద్ధంతో గద్దె దింపారు.  పాశ్చాత్య దేశాల్లో తొలి కమ్యూనిస్టు దేశంగా క్యూబాను ఏర్పాటు చేశారు.  కేవలం 33 ఏళ్ల వయసులోనే  క్యూబా త్రివిధ దళాల అధిపతి పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత నెలరోజుల్లోనే ఆ దేశ ప్రధానిగా అధికారం చేపట్టారు.  ఆ తర్వాత 1976 నుంచి 2008 వరకు  అధ్యక్షుడిగా క్యూబాకు మార్గ నిర్దేశం చేశారు. 
క్యాస్ట్రోపై 638సార్లు అమెరికా హత్యాయత్నం
మొదటి నుంచి అమెరికా సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా క్యాస్ట్రో వ్యతిరేకిస్తూ వస్తుండడంతో...ఆయనను అంతమొందించేందుకు అమెరికా అనేక ప్రయత్నాలు చేసింది.  తన గూడాఛార సంస్థ సీఐఏతో క్యాస్ట్రోను హత్య చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది.  ఇలా మొత్తంగా 638సార్లు క్యాస్ట్రో హత్యకు ప్రయత్నించింది. అయినప్పటికీ నిత్యం అప్రమత్తంగా ఉండే ఫిడెల్‌ క్యాస్ట్రో అమెరికా కుట్రలను తుత్తునియలు చేశారు. అమెరికా ప్రయత్నాలన్నీ ఛేదించి మృత్యుంజయుడిగా నిలిచారు. 

 

Don't Miss