యధేచ్చగా సాగుతున్న భూ కబ్జాలు

12:55 - July 12, 2018

హైదరాబాద్ : వారంతా పేద, మ‌ద్యతర‌గ‌తి కుటుంబాల‌కు చెందిన వాళ్లు..  హైద‌రాబాద్ లాంటి మ‌హానగ‌రంలో ఓ గూడుంటే చాలన్న భావనతో..
ఏళ్ల త‌ర‌బ‌డి క‌ష్టపడి కూడ బెట్టుకున్న సొమ్ముతో స్థలాలు కొన్నారు. కానీ వాటిని గ‌ద్దల్లా త‌న్నుకుపోవ‌డానికి రెడి అయ్యారు భూ భ‌కాసురులు. దీంతో స‌తీష్ హౌసింగ్‌ కో-అప‌రేటివ్ స‌భ్యులు తమకు న్యాయం చేయాలని  ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

హైద‌రాబాద్ అభివృద్దితోపాటే భూముల ధ‌ర‌ల‌ు పెరిగిపోయాయి. దీంతో ఎటుచూసినా.. భూ కబ్జాలు య‌థేచ్చగా సాగిస్తున్నారు. ఒక‌రు కొన్న భూమిని మ‌రొక‌రు ఆక్రమించడం, ఒకే భూమిని ఇద్దరు ముగ్గిరికి అమ్మడం వంటి ఘట‌న‌లు  గ్రేట‌ర్ చుట్టూ సర్వసాధారణం అయిపోయింది. అవినీతి  అధికారులు, రాజ‌కీయ నేతల అండదండలు చూసుకుని అక్రమార్కులు  బరితెగిస్తున్నారు.  కుత్బుల్లాపూర్ మండ‌లం బౌరం పేట్  గ్రామ ప‌రిధిలో 1980వ ద‌శ‌కంలో ఇళ్ల స్థలాల‌కోసం భూములు కోనుగోలు చేశారు. కానీ ఏళ్లు గ‌డుస్తున్నా ఇళ్ళు కట్టుకో లేకున్నామంటూ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు బాధితులు

కుత్బుల్లాపూర్ మండ‌లం బౌరం పేట్  గ్రామ ప‌రిధిలోని 240 నుంచి 269 వ‌ర‌కు ఉన్న స‌ర్వే న‌ంబర్‌లోని 310 ఎక‌రాల్లో దాదాపు 15 లే ఔట్లు వెలిశాయి.  ఇందులో స‌తీష్ హౌసింగ్ సొసైటి  ద్వారా 800 మంది,  జీపీఆర్‌  హౌసింగ్ ద్వారా మ‌రో 500 మంది ప్లాట్లు కొన్నారు. కానీ అక్కడి  రెండు లే ఔట్లలో 19 ఎక‌రాల‌ు తమ భూమి ఉంద‌ంటూ యాదగిరి అనే వ్యక్తి దౌర్జన్యం చేస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఆర్డీవో, డిప్యూటీ క‌లెక్ట‌ర్లు    యాద‌గిరికి ఎలాంటి భూమి లేదని స్పష్టం చేశారని అంటున్నారు. అన్ని స‌క్రమంగా ఉన్నా త‌మ‌ను బెదిరిస్తున్నాడని  ఆరోపిస్తున్నారు బాధితులు. ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్నవారెవరికీ తాము భూములు  అమ్మలేదంటున్నారు గత భూ యజమానులు. ఆ భూమి తనదేనని చింత‌ల యాద‌గిరి ఎలా అంటున్నారో త‌మ‌కు అర్థం కావ‌డం లేదంటున్నారు రైతులు.

మరోవైపు జీపీఆర్‌ హౌజింగ్  వారు కూడా ఇబ్బందుల‌కు గురిచేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు బాధితులు. వారిపై పోలిసుల‌కు కూడా ఫిర్యాదు చేశామంటున్నారు. చెమటోడ్చి కూడపెట్టిన డబ్బుతో కొన్న  భూముల్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. ప్రభుత్వం స్పందించి త‌మ‌కు న్యాయం చెయ్యాల‌ని కోరుతున్నారు. భూ సమస్యలు  అధికారుల దృష్టికి వచ్చినప్పుడు అన్ని విభాగాలు ఒకేసారి స్పందించాలని కోరుతున్నారు బాధితులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

Don't Miss