దంతెవాడ ఎన్ కౌంటర్ లో ఇద్దరు నక్సల్స్ మృతి

Submitted on 14 July 2019
2 Naxals killed in encounter with police in Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌ లోని దంతెవాడ జిల్లాలో ఇవాళ(జులై-14,2019)ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు నక్సలైట్లను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.మృతిచెందిన ఇద్దరు నక్సలైట్లలో ఓ మహిళ కూడా ఉంది.రాజధాని రాయ్‌పూర్‌కి 400 కిలోమీటర్ల దూరంలోని గమియాపాల్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వ్‌ భద్రతా దళాల బృందం.. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌ నిర్వహిస్తున్న సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కాల్పుల మోత మోగిందని, కొంతమంది మావోయిస్టులు అడవిలోకి పారిపోయారని ఆయన తెలిపారు.

ఎన్‌కౌంటర్‌ అనంతరం ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను, పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి పేర్లు దేవ, మంగ్లీగా గుర్తించారు. వారిద్దరిపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉంది. మరోవైపు, ఇదే ప్రాంతంలో అనుమానిత మహిళా మావోయిస్టు కోసీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. 

Chhattisgarh
DANTEWADA
Police
naxals
died
District reserved force
Encounter

మరిన్ని వార్తలు