క్యాన్సర్ కణాలపై పోరాట సాధకులు..

17:51 - October 1, 2018

స్వీడన్ : నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు మరియు ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించబడ్డాయి. ఈ నేపథ్యంలో 2018 సంవత్సరానికి గానూ నోబెల్‌ పురస్కారాల ప్రకటన సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు వైద్య శాస్త్రంలో నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. ఈ ఏడాది అమెరికా, జపాన్‌కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా నోబెల్‌‌ను పంచుకుంటున్నారు. అమెరికాకు చెందిన జేమ్స్‌ పి అల్లిసన్‌, జపాన్ కు చెందిన  తసుకు హోంజో వైద్యరంగంలో నోబెల్‌ బహుమతి అందిస్తున్నట్లు స్టాక్‌హోం లోని నోబెల్‌ అసెంబ్లీ ఈరోజు ప్రకటించింది.
క్యాన్సర్ చికిత్స కోసం వీరు చేసిన పరిశోధనలకు గానూ నోబెల్‌ బహుమతి ప్రకటించారు. క్యాన్సర్‌ కణాలపై పోరాడేందుకు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ సాయపడుతుందని వీరు తమ అధ్యయనాల ద్వారా కనుగొన్నారు. పురస్కారంతో పాటు 9 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్ల అంటే 7,80,000 పౌండ్ల నగదు బహుమతిని కూడా వీరు అందుకోనున్నారు. అక్టోబరు 5 నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబరు 8న ఆర్థిక రంగంలో నోబెల్‌ పురస్కారాల విజేతలను వెల్లడిస్తారు.

Don't Miss