ముంబై వరుస పేలుళ్లు.. దోషులకు శిక్ష ఖరారు

22:00 - September 7, 2017

మహారాష్ట్ర : 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో టాడా కోర్టు శిక్షను ఖరారు చేసింది. అండర్‌ వరల్డ్‌ డాన్‌ అబూసలేంకు జీవిత ఖైదు విధించింది. ఆయుధాలు సప్లయ్‌ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కరీముల్లాఖాన్‌కు జీవిత ఖైదుతో పాటు 2 లక్షల జరిమానా విధించింది. అబూ అనుచరులు మహ్మద్‌ తాహిర్‌ మర్చంట్, ఫిరోజ్‌ అబ్దుల్‌ రషీద్‌ ఖాన్‌లకు ఉరిశిక్ష శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

1993 నాటి ముంబయి వరుస పేలుళ్ల కేసులో ముంబయిలోని ప్రత్యేక టాడా కోర్టు దోషులకు శిక్ష ఖరారు చేసింది. అబూసలేంకు జీవిత ఖైదు, మరో కీలక నిందితుడు కరీముల్లాఖాన్‌కు జీవిత ఖైదుతో పాటు 2 లక్షల జరిమానా విధించింది. అబూ అనుచరుడు మహ్మద్‌ తాహిర్‌ మర్చంట్, ఫిరోజ్‌ అబ్దుల్‌ రషీద్‌ ఖాన్‌లకు ఉరిశిక్ష  విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. రియాజ్‌ సిద్ధిఖీకి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

1993 మార్చి 12న ముంబైలో వరుస పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు రెండు గంటల వ్యవధిలో 12 చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఉగ్రవాదులు పేలుళ్లకు అత్యంత శక్తిమంతమైన ఆర్డీఎక్స్‌ను వినియోగించారు. 

వరుస బాంబు పేలుళ్లలో 257 మంది మృతి చెందగా... 713 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్లలో కనీసం 27 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. పేలుళ్ల తర్వాత అబూసలేం పోర్చుగల్‌ పారిపోయాడు. 2005లో అబూసలేంను పోర్చుల్‌ పోలీసులు అరెస్టుచేసి, నేరస్థుల మార్పిడి ఒప్పిందం కింద మన దేశానికి అప్పంచారు. అబూసలేంను మన దేశానికి అప్పగించే ముందు ఇతగాడికి మరణశిక్ష విధించవద్దని పోర్చుగల్‌  షరతు పెట్టింది

ఈ కేసును సిబిఐ విచారణ చేపట్టింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా దావూద్‌ ఇబ్రహీం, టైగర్‌ మెమెన్, మహ్మద్‌ దోసా, ముస్తఫా దోసా తదితరులు కుట్ర పన్ని ఈ దాడికి పాల్పడినట్లు సిబిఐ విచారణలో తేల్చింది. 2007లో తొలివిడత కేసు విచారణ ముగిసింది. 100 మందిని దోషులుగా తేల్చగా... యాకుబ్‌ మెమెన్‌తో పాటు సంజయ్‌దత్‌ కూడా ఉన్నారు. యాకూబ్‌ మెమెన్‌ను 2013లో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. 2015లో ఈ శిక్షను అమలు చేశారు.

ఈ కేసుకు సంబంధించి రెండో విడత విచారణ చేపట్టిన ప్రత్యేక టాడా కోర్టు 2017, జూన్‌ 16న తీర్పు వెలువరించింది...అబూసలేంతో పాటు ముస్తఫా దోసా, కరీముల్లాఖాన్‌, ఫిరోజ్‌ అబ్దుల్‌ రషీద్‌ఖాన్‌, రియాజ్‌ సిద్దిఖీ, తాహిర్‌ మర్చంట్‌లను దోషులుగా తేల్చింది. వీరిలో ముస్తఫా దోసా గుండెపోటుతో మరణించాడు. ఆధారాల్లేనందున మరో నిందితుడు అబ్దుల్‌ ఖయ్యూమ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. 

ముస్తఫా దోసా పేలుళ్లకు ప్రణాళికల కోసం సమావేశాలు నిర్వహించేవాడు. అబూ సలేం ఉగ్ర దాడుల కోసం ఎకె-56, గ్రెనేడ్లను భరూచ్‌ నుంచి ముంబైకి చేరవేయడంలో కీలక పాత్ర వహించాడు. ఫిరోజ్‌ అబ్దుల్‌ రషీద్‌ ఖాన్‌ ఆయుధాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడంలో మద్దతిచ్చాడు. రియాజ్‌ సిద్ధిఖి గుజరాత్‌ నుంచి ఆయుధాలను ముంబైకి తీసుకురావడానికి అబుసలేంకు సహకరించాడు. కరీముల్లాఖాన్‌ దోసా మద్దతుతో ఆయుధాలను టార్గెట్‌ చేసిన ప్రాంతానికి చేరవేశాడు. మహ్మద్‌ తాహిర్‌ మర్చంట్‌ ఆయుధ శిక్షణ కోసం అత‌ను భార‌తీయ యువ‌త‌ను పాకిస్థాన్‌కు పంపించాడు. ఈ కుట్రలకు పాల్పడినందునే టాడా కోర్టు వీరికి శిక్షలు విధించింది.

Don't Miss