రోగనిరోధకశక్తిని పెంచే పచ్చి బఠాణీలు...

10:30 - January 3, 2017

బఠాణీలను ఆహారంగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. వేయించిన వాటితో పోలిస్తే ప్రొటీన్లూ విటమిన్లూ ఖనిజాలూ పుష్కలంగా ఉండే తాజా ఆకుపచ్చ బఠాణీలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందుకే కూరలూ బిర్యానీలూ ఇతరత్రా చిరుతిళ్ల రూపంలో పచ్చిబఠాణీల వాడకం బాగా పెరిగింది. బఠాణీల్లో ఆకుపచ్చ, పసుపు రకాలతోబాటు వూదారంగువీ కనిపిస్తుంటాయి. చలికాలంలో ఎక్కువగా పండే బఠాణీలను ఆ కాలంలో తీసుకోవడంవల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా లభ్యమవుతాయి. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే బఠాణీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

వంధ్యత్వాన్ని నివారించడానికి బఠాణీలు బాగా పనిచేస్తాయి. ఇందులో ఫోలిక్‌ యాసిడ్‌ పుష్కలంగా ఉంటుంది. కణాల్లోని డీఎన్‌ఏ తయారీకి ఫోలేట్లు అవసరం. ఇవి సమృద్ధిగా ఉండే బఠాణీలను తీసుకోవడం ద్వారా గర్భం ధరించడం సులువవుతుంది. గర్భిణులు బఠాణీలు తీసుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డలో నాడీ సంబంధ సమస్యలకు చెక్ పెట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

బఠాణీల్లో బీటా సైటో స్టెరాల్‌ లభ్యమవుతుంది. ఈ రకమైన స్టెరాల్స్‌ శరీరంలో పేరుకున్న కొలెస్ట్రాల్‌ శాతాన్ని తగ్గిస్తాయి. తాజా బఠాణీల్లో కె-విటమిన్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. ఎముక బరువు పెరగడానికి ఇది ఎంతో అవసరం.

ఆల్జీమర్స్‌, ఆర్థరైటిస్‌ వంటి వ్యాధుల నివారణకు బఠాణీలతో తయారు చేసిన ఆహారం తోడ్పడుతుంది. బఠాణీల్లో యాంటీ యాక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్స్‌ జియాక్సాంథిన్‌, ల్యూటెన్‌, విటమిన్‌-ఎ వంటి కెరొటినాయిడ్లూ పుష్కలంగా దొరుకుతాయి. అందుకే ఇవి కంటి ఆరోగ్యానికీ ఎంతో మంచివని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Don't Miss