ఐదో రోజు దద్దరిల్లిన పార్లమెంట్

21:41 - February 9, 2018

ఢిల్లీ : 

పార్లమెంట్‌లో ఐదోరోజు ఏపీ ఎంపీలు ఆందోళనను ఉధృతం చేశారు. సమాశాలకు చివరి రోజు కావడంతో నినాదాలతో హోరెత్తించారు. లోక్‌సభలో టీడీపీ, వైసీపీ ఎంపీలు నిరసన గళం వినిపించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ టీడీపీ, వైసీపీ సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుమట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్‌ పలుమార్లు వారించినా వినకపోవడంతో సభను వాయిదా వేశారు.

 

టీడీపీ, వైసీపీ సభ్యుల ఆందోళన
తిరిగి సభ ప్రారంభమైనా టీడీపీ, వైసీపీ సభ్యులు ఆందోళన విరమించలేదు. స్పీకర్‌ పోడియం ముందు నిరసన తెలిపారు. పెద్దగా నినాదాలు సభా కార్యక్రమాలు అడ్డుకున్నారు. దీంతో స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ సభను మార్చి 5కు వాయిదా వేశారు.అటు రాజ్యసభలోనూ ఏపీ ఎంపీల నిరసన కొనసాగింది. టీడీపీ, కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఏపీకి న్యాయం చేయాలని కోరారు. దీంతో సభ 12 గంటలకు వాయిదా పడింది.

రాజ్యసభ 12గంటలకు తిగిరి ప్రారంభమైనా టీడీపీ, కాంగ్రెస్‌ సభ్యులు వెనక్కితగ్గలేదు. ఏపీకి న్యాయం చేయాల్సిందేనని పట్టుబట్టారు. రాజ్యసభ చైర్మన్‌ పదేపదే వారించినా సభ్యులు వినిపించుకోలేదు. దీంతో సభ మరోసారి వాయిదా పడింది.

మధ్యాహ్నం 2.30కు మళ్లీ రాజ్యసభకాగానే టీడీపీ, కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన చేపట్టారు. టీడీపీ సభ్యులు ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో రాజ్యసభలో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ ఎంపీల తీరును తప్పుపట్టారు. ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంలో ఒకవైపు భాగస్వామిగా ఉంటూ... మరోవైపు ఆ ప్రభుత్వ నిర్ణయాన్నే తప్పుపట్టడమేంటని ఆయన ప్రశ్నించారు. ఏపీకి న్యాయం చేయడంపై టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ది ఉంటే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే వారు చేసే ఆందోళనకు నైతికత ఉంటుందని స్పష్టం చేశారు.

రాహుల్‌గాంధీ మద్దతు
కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై 5 రోజులుగా ఏపీ ఎంపీలు నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. విభజన హామీలు నెరవేర్చాలంటూ ఏపీ ప్రజలు చేస్తున్న డిమాండ్లకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మద్దతు ప్రకటించారు. ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలన్న డిమాండ్లకు ఆయన మద్దతు తెలిపారు. ఏపీకి న్యాయం జరగాలంటే అన్ని పార్టీలు ఏకమై పోరాడాలని సూచించారు.ఏపీకి న్యాయం చేసేంత వరకు ఎంతవరకైనా వెళ్తామని ఎంపీలు తేల్చి చెబుతున్నారు. ఢిల్లీలోనేకాదు.. ఇక నుంచి గల్లీల్లోనూ తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఏపీకి న్యాయం చేయకపోతే కాంగ్రెస్‌కు పట్టినగతే బీజేపీకి పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

Don't Miss