అవలాంచ్ ను అధిగమించిన అతివలు..

11:46 - May 25, 2018

ఆశయ సాధనకోసం అననుకూల ప్రరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకునే నేర్పరితనం తెగువ మహిళల సొంతం. అనుకున్నది సాధించేంతవరకూ విశ్రమించిన గుణం వారి పట్టుదలకు నిదర్శనంగా నిలస్తుంది. వీరేం చేస్తార్లే అనుకునేవారికి విజయపతాకాన్ని అందుకుని నిలువెత్తు విజయపతాకలా నిలిచి, గెలిచి చూపించే సత్తా వారికి వెన్నతో పెట్టిన విద్య. ఆడవారు వంటికే పరిమితం అయిన రోజుల నుండి సాహసాలు చేసే స్థాయికి..కంపెనీల ఆదాయాలను రికార్డుల స్థాయికి చేర్చేస్థాయికి చేరారు. ఇదంతా రాత్రికి రాత్రి వచ్చిన విజయాలు కాదు..అందులో వారి పోరాటం..పట్టుదల..సమర్ధత..చాతుర్యం ఇమిడివున్నాయి. ఈ నేపథ్యంలో భారతమహిళాశక్తిని చాటి చెప్పిన సాహస యాత్రకు నాంది పలికింది.

సెప్టెంబరు 10న గోవా నుంచి ప్రారంభమైన భారతమహిళా శక్తి సాహస యాత్ర..

సెప్టెంబరు 10న గోవాలో భారతమహిళా శక్తి సాహసయాత్రకు నాంది పలికింది. ‘నావికా సాగర్‌ పరిక్రమ’ సాహసయాత్రకు ప్రారంభించిన రక్షణశాఖా మంత్రి కూడా మహిళే కావటం మరో విశేషం. ఆరుగురు సాహస అతివలు ఈ యాత్రకు నాంది పలికారు. వారిలో ఇద్దరు తెలుగువారు కావటం మరో విశేషం. విభిన్నవాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటు వారి యాత్రను కొనసాగించారు.

ఆరుగురు మహిళా లెఫ్టినెంట్ కమాండర్ల సాహస యాత్ర..
విశాఖకు చెందిన లెఫ్ట్టినెంట్‌ కమాండర్‌ పాతర్లపల్లి స్వాతితో పాటు లెఫ్ట్టినెంట్‌ కమాండర్లు వర్తికాజోషి, ప్రతిభా జాంవాల్‌, లెఫ్ట్‌నెంట్లు ఐశ్వర్యా బొడ్డపాటి, ఎస్‌.విజయదేవి, పాయల్‌గుప్తా ‘నావికా సాగర్‌ పరిక్రమ’ సాహసయాత్రలో పాల్గొన్నారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‘నావికా సాగర్‌ పరిక్రమ’ సాహసయాత్రను ప్రారంభించారు. ఐ.ఎన్‌.ఎస్‌.వి.తరిణి తెరచాప పడవపై గోవా నుంచి 5,500నాటికల్‌ మైళ్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియాలోని ఫ్రీమాంటెల్‌ పోర్టుకి చేరుకోవాలనే లక్ష్యంతో మేం ప్రయాణం మొదలుపెట్టారు. మొత్తం ఎనిమిది నెలల పదిరోజులలో మూడు కాలాలను వారు సాహసయాత్రలో పలకరించాయి. అంటే వేసవి, శీతలం, వర్షాకాలలు వారికి స్వాగతం చెప్పాయి. ఆయా వాతావరణ పరిస్థితుల్లో ఎదురైన పెనుసవాళ్లనూ ఆ ఆరుగురు సాహసవనితలు అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఎటువంటి పరిస్థితులకు భయపడకుండా తమ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించారు. ఈ ప్రయాణంలో ఎదురయ్యే కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు వారు ముందుగానే సిద్ధపడ్డారు. దానికి అనుగుణంగానే వారు తగిన శిక్షణ తీసుకున్నారు. గోవా నుంచి 5,500నాటికల్‌ మైళ్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియాలోని ఫ్రీమాంటెల్‌ పోర్టుకు వెళ్లడానికి అరేబియా సముద్రం, హిందూ మహా సముద్రాల మీదుగా ప్రయాణించారు. మొదట ఫ్రీమాంటెల్‌ చేరుకుని ఆపై న్యూజిల్యాండ్‌లోని లిటిల్‌టన్‌, ఫాక్‌ల్యాండ్స్‌లోని పోర్ట్‌ స్టాన్లీ, దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌, మారిషస్‌ పోర్టుల్లో ఆగి..అనతరం భూమధ్యరేఖను రెండుసార్లు దాటారు.

ఫాక్‌ల్యాండ్‌ దీవిచేరే క్రమంలో చుట్టుముట్టిన మంచు తుఫాలు..
25 రోజులపాటు 3,600 నాటికల్‌ మైళ్లు ప్రయాణించి న్యూజిల్యాండ్‌లోని లిటిల్‌టన్‌కు చేరుకున్న అనతరం ఆరువేల నాటికల్‌ మైళ్ల దూరంలో ఉన్న ఫాక్‌ల్యాండ్‌ దీవి చేరుకునే సమయంలో పలు మాత్రం సవాళ్లను ఎదుర్కొన్నారు. ఫాక్‌ల్యాండ్‌ దీవి చేరుకోవడానికి దక్షిణ పసిఫిక్‌, దక్షిణ అట్లాంటిక్‌ మహాసముద్రాల మీదుగా ప్రయాణించాల్సి వుంది. అక్కడ చలి తీవ్రత పెరిగింది. మంచు తుపానులు చుట్టుముట్టాయి. ఒక్కో తుఫాను రెండురోజుల పాటుకొనసాగేది. ఎముకలు గడ్డకట్టే చలిలో తమను తాము రక్షించుకోవడమే కాదు పడవనీ సురక్షితంగా కాపాడుకోవాలి. తెరచాపను ఒడుపుగా తిప్పుతూ ఉండాలి. కొన్నిసార్లు వాటి తాళ్లూ తెగిపోయే సందర్భాలు. కానీ చేయితిరిగినపనివారిలాగా సమర్థవంతగా ఎదుర్కొనేవారు. ఆ వాతావరణానికి జనరేటర్‌ పాడైపోయింది... మంచు తుఫానులయ్యాక భారీ వర్షాలు భయపెట్టాయి. రోజంతా వర్షం ఆగకుండా కురవంటం సముద్రం అల్లకల్లోలంగా మారి పడవ బొల్తా పడిపోతుందేమోననని పరిస్థితికి చేరుకున్నా అన్నింటికి సిద్ధపడిన సందర్భంలో కూడా వారి ఆత్మవిశ్వాసం అదరక బెదరకు నిలబడ్డారు. ఇక ముందుకు వెళ్లడం కష్టం అనుకున్న తరుణంలో అధైర్యాన్ని దరిచేరనీయకుండా ముందుకే కొనసాగారు. మరోసారి జనరేటర్‌ పాడైపోయింది. దీంతో ప్రత్యామ్నాయంగా ఉంచుకున్న సౌర విద్యుత్తుపై ఆధారపడ్డారు. అలా ఎన్నో ఆటంకాల తరువాత చివరకు ఫాక్‌ల్యాండ్‌ దీవికి చేరుకోగలిగారు.

కేప్‌టౌన్‌పోర్టుకి చేరుకున్న సాహసవనితలు..
ఫాక్‌ల్యాండ్‌ దీవి నుండి మరో ఇరవై ఎనిమిది రోజుల తరువాత కేప్‌టౌన్‌పోర్టుకి చేరుకున్నారు. మధ్యలో మారిషస్‌ దగ్గరకు వచ్చేసరికి పడవ స్టీరింగ్‌ విరిగిపోయింది. వాస్తవానికి ఈనెల 19వ తేదీకే గోవా చేరుకోవాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో రెండు రోజులు ఆలస్యంగా కేప్ టౌన్ పోర్టుకు చేరుకున్నారు. గాలి తీవ్రతకు అనుగుణంగా పలుసార్లు వేరే దిక్కులకు వెళ్లిపోయి తిరిగి వారి మార్గంలోకి వచ్చేవారు. ఈ క్రమంలో అనారోగ్యాలూ ఎదుర్కొన్నారు. పోర్టుకి చేరుకున్న అనంతరం వైద్య పరీక్షలు చేయించుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారు. అలా ప్రపంచదేశాలకు భారతశక్తి చాటి చెప్పారు ఈ సాహసవనితలు పాతర్లపల్లి స్వాతితో పాటు లెఫ్ట్టినెంట్‌ కమాండర్లు వర్తికాజోషి, ప్రతిభా జాంవాల్‌, లెఫ్ట్‌నెంట్లు ఐశ్వర్యా బొడ్డపాటి, ఎస్‌.విజయదేవి, పాయల్‌గుప్తా లు. మరి వారికి భారతనారీ లోకం నుండే కాదు యావద్భారతావని నుండి సాహస సెల్యూట్ ను చేస్తున్నాం. అననుకూల పరిస్థితులను,అననుకూల కాలాలను, వాతావారణాలను, విపత్కర పరిస్థితులను సాహసంగా అధిగమించి కన్నవారిని, కట్టుకున్నవారిని, కుటుంబాలను వదలి నెలలపాటు సాగరంలో సాగర కన్యల్లా..అత్యంత సాహసాలు చేసిన ఈ వీరవనితలకు రెడ్ సెల్యూట్..

Don't Miss