8మంది.. కేవలం 8 మంది బాస్....

20:10 - January 17, 2017

8మంది.. కేవలం 8 మంది బాస్.. ఈ 8మంది దగ్గరే ప్రపంచంలోని సొమ్ములో సింహభాగం ఉంది. వీళ్ల దగ్గరే సకల సంపదంతా చేరుతోంది. ఈ లెక్క ఏటా డబుల్, ట్రిపుల్ అవుతోంది. వీళ్లు పంచుకోగా మిగిలిన అరకొర సంపదనే ప్రపంచంలోని దాదాపు 750 కోట్లమంది పంచుకుంటున్నారు. ఎందుకీ తేడా? సంపద సృష్టిలో, పంపిణీల్లో ఎక్కడ తేడా వస్తోంది? దీనిపై ప్రత్యేక కథనం..డబ్బు డబ్బుని సంపాదిస్తుంది. ఏదో సినిమా డైలాగ్ లా ఉన్నా ఇది నిజమే అనిపిస్తుంది. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే డబ్బు డబ్బుని సంపాదిస్తే, పేదరికం మరింత పేదరికాన్ని ఆకర్షిస్తోంది మరి. ప్రపంచం ఏ రకంగా చూసినా తీవ్ర అసమానతలతో కొట్టు మిట్టాడుతోంది. సంపద అసమాన పంపిణీ ఆదినుంచీ అదే తీరులో కొనసాగుతుంది. ఇక ఆధునిక ప్రపంచంలో ఈ తేడాలు మరింత పెరిగి ప్రపంచ దేశాలను సంక్షోభంలో ముంచే ప్రమాదంలో పడేశాయి. ఈ క్రమంలో జరిగిన సర్వేలు నిజాలను తేటతెల్లం చేస్తున్నాయి.

ఎగబాకుతున్న కుబేరులు..
సంపద అమాంతంగా పెరుగుతోంది. ఏటా చిట్టాలో మరింత పైపైకి ఎగబాకుతున్నారు..అందరిసొమ్మూ ఈ కొందరి దగ్గరికే చేరుతోంది. వనరులను పిండిన లాభమంతా వీళ్లకే అందుతోంది. మరోపక్క మెజారిటీ ప్రజల దగ్గర చిల్లిగవ్వకూడా మిగలని పరిస్థితి ఏర్పడుతోంది. మనదేశంలో కుబేరులు రోజు రోజుకు ఆకాశానికి ఎగబాకుతున్నారు.. బిలియనీర్ల సంపద అనూహ్యంగా పెరుగుతోంది. కానీ, అదే సమయంలో అంతరాలు, ఆర్థిక సంక్షోభాలు మరింత పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బతికే దారిలేక, అసంఖ్యాక జనం అగచాట్ల పాలవుతున్నారు. అధిక ధరలు, రూపాయి విలువ పతనం వంటి కారణాలన్నీ అదృశ్య శక్తులై అశేష జన బాహుళ్యాన్ని అగాథంలోకి నెడుతున్నాయి. ఆక్స్ ఫామ్ నివేదికలో భారత్ గురించిన వివరాలేమున్నాయి? భారత్ లో 84మంది బిలియనీర్లు. ధనవంతుల జాబితాలో నాలుగో స్థానం … దరిద్రుల భారతంలో ధనవంతుల ప్రగతి ఇది. కుబేరులు పెరుగుతున్నారు?

మరి కుచేలుర సంగతేంటి ?
మరి కుచేలుర సంగతేంటి? అసలీ వేలకోట్ల సామ్రాజ్యాలకు పునాదులెక్కడున్నాయి? ప్రపంచంలో భారత్ అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పటికీ దాని సంపద మాత్రం జనాభా అంతటికీ సరిగ్గా పంపిణీ జరగలేదు. ప్రపంచీకరణ నేపథ్యంలోనే పేదరికం పెరిగిందన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పెట్టుబడిదారి విధానాల వల్ల ధనికులు బిలియనీర్లుగా అవతారం ఎత్తుతుంటే.. పేదలు నిరుపేదలుగా మారిపోతున్నారు. బహుళజాతి కంపెనీల అనుకూల విధానాలు అవలంబించినంత కాలం ఈ అంతరాలు మరింత పెరుగుతాయి. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

Don't Miss