ఏపీలో ఏసీబీ..

18:46 - January 9, 2017

అనంతపురం : ఏపీలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో నగదు స్వాధీనం చేసుకుని పలువురిని అరెస్ట్‌ చేశారు.

అనంతపురం, చిత్తూరు, నెల్లూరు,శ్రీకాకుళం చెక్‌పోస్టుల్లో సోదాలు
ఏపీలోని పలు చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

నెల్లూరు జిల్లా తడ మండలం భీములవారిపాలెం చెక్‌పోస్ట్‌లో తనిఖీలు
నెల్లూరు జిల్లా తడ మండలం భీములవారిపాలెం చెక్‌పోస్ట్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు ప్రైవేట్‌ వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. వారి దగ్గర నుంచి 58 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వాణిజ్య పన్నుల సిబ్బంది పేరుతో నిందితులు డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. అలాగే అనంతపురం జిల్లా హిందూపురం కొడికొండ చెక్‌పోస్ట్‌పై కూడా దాడులు జరిపి... ఓ ప్రైవేట్‌ వ్యక్తినుంచి 15 వేల రూపాయల్ని స్వాధీనం చేసుకున్నారు. చిత్తురు జిల్లా పలమనేరులోని కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసులోనూ ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగాయి. ఇక్కడ 35వేల రూపాయల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటు పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమల్లి వద్ద ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ఆర్టీఏ చెక్‌పోస్టు లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి... లెక్కల్లో చూపని కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు.
లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని పురుషోత్తపురం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం తెల్లవారు జాము నుంచి ఉదయం 9గంటల వరకూ ఈ దాడులు కొనసాగాయి. ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర ఆధ్వర్యంలో మూకుమ్మడి దాడులు జరిపారు.ఈ సందర్భంగా అక్కడ అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న 8 మంది దళారులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిబ్బంది పనిచేసే కౌంటర్లలో అక్రమంగా డబ్బులు వసూళ్ళు చేస్తున్నట్లుగా గుర్తించారు. మొత్తం 64వేల రూపాయల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. దాడులకు సంబంధించి పూర్తి నివేదికను ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళతామని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు. మొత్తానికి ఏపీలోని పలుచోట్ల జరిపిన ఈ ఆకస్మిక దాడులతో రవాణా శాఖ ఉలిక్కిపడినట్లయింది.  

Don't Miss