అన్నాడీఎంకేలో ప్రకంపనలు

16:31 - January 8, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు దీప ఆశాదీపంగా కనిపిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడులు దీప ఏఐఏడీఎంకే రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని విశ్లేష్తున్నారు. తన అత్త జయలలిత ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన దీప.. సరైన తరుణం కోసం వేచి చూస్తున్నారు. 
రాజకీయ ప్రకంపనలు 
దీప... తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు సంచలన నేతగా మారుతున్నారు. జయలలితకు నిజమైన వారసురాలిని తానేనంటూ ప్రకటనలు చేస్తూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఏఐఏడీఎంకే నేతలకు నిద్రలేకుండా చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అన్న జయకుమార్‌ కూతురు దీప. జయలలిత ఆస్పత్రిలో ఉండగా చూసేందుకు కూడా అనుమతించకపోవడం దీపను కలిచివేసింది. దీంతో జయకు  అందించిన వైద్యంపై మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శశికళ కనుసన్నల్లో జయకు జరిగిన వైద్యంపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసి, కలకలం సృష్టించిన దీపకు ఏఐఏడీకే కార్యకర్తలు జేజేలు పలుకుతున్నారు. జయలలిత ఆశయసాధన కోసం రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. 
దీప నివాసానికి క్యూ కడుతున్న అన్నాడీఎంకే కార్యకర్తలు 
జయలలిత నెచ్చెలి శశికళ ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రాంతాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే తరుణంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రోజువారీగా చైన్నైకి భారీగా తరలివస్తున్నఏఐఏడీకే కార్యకర్తలు, నేతలు నేరుగా దీప నివాసానికి వస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తే మద్దతు ఇస్తామని హామీ ఇస్తున్నారు.  దీప కూడా తన నివాసానికి తరలివస్తున్న కార్యకర్తలను నిరుత్సాహ పరచకుండా తన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని హామీ ఇస్తున్నారు. అచ్చం జయలలిత తరహాలో హావభావాలు ప్రదర్శిస్తూ చేస్తున్నప్రసంగాలు అన్నా డీఎంకే కార్యకర్తలను  ఆకట్టుకుంటున్నాయి. 
అన్నాడీఎంకే శిబిరంలో ప్రారంభమైన కలవరం
జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్‌కే నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నియోజకర్గం నుంచి శశికళ పోటీ చేసే అవకాశాలున్నాయి. అయితే ఓటర్ల మనోగతం మరోలా ఉందని సర్వేలు చెబుతున్నాయి. అమ్మకు ఓట్లేసిన  తాము శశికళ పోటీ చేస్తే ఓట్లేయబోమని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నా డీఎంకే శిబిరంలో కలవరం ప్రారంభమైంది. దీనిని ప్రాతిపదికగా తీసుకుని దీపను రాజకీయల్లోకి తీసుకొచ్చేందుకు కొందరు అన్నా డీఎంకే నేతలు కూడా తెరవెనుక ప్రయత్నిస్తున్నారని తమిళనాడు రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.  దీప కూడా రోజువారీ రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తూ, సమయంలో కోసం వేచిచూస్తున్నారు. దీప రాజకీయ రంగప్రవేశం తర్వాత తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 

 

Don't Miss