గులాబీ పతంగుల దోస్తీ!..

07:38 - April 17, 2018

హైదరాబాద్ : తెలంగాణలో అనధికారికంగా మిత్రపక్షంగా కొనసాగుతున్న టీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకే దారిలో నడుస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా జట్టుకట్టేందుకు సిద్ధమవుతున్నాయి. టీఆర్‌ఎస్‌కు మొదటి నుంచి సహకరిస్తున్న ఓవైసీ బ్రదర్స్‌... జాతీయ రాజకీయాల్లోనూ గులాబీ పార్టీని సమర్ధించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

బలపడుతున్న టీఆర్‌ఎస్‌, ఎంఐఎం బంధం
టీఆర్‌ఎస్‌, ఎంఐఎం బంధం మరింత బలపడనుంది. టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం పూర్తి సహకారం అందించేందుకు రెడీ అయ్యింది. ఫెడరల్‌ ఫ్రంట్‌తో టీఆర్‌ఎస్‌ తీసుకునే నిర్ణయాలకు సంపూర్ణ సహకారం అందించేందుకు ఓవైసీ బ్రదర్స్‌ రెడీ అయ్యారు. దీంతో నిన్న మొన్నటి వరకు తెలంగాణ పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎక్కడ జరిగినా స్వతంత్రంగా అభ్యర్థులను రంగంలోకి దించిన ఎంఐఎం పార్టీ... ఇప్పుడు వెనకడుగు వేస్తోంది. ఒంటరిగా కొన్ని స్థానాల్లో పోటీచేసినా... గెలుపోటములపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే కర్నాటక ఎన్నికల్లో తమ పార్టీ 40 స్థానాల్లో పోటీ చేస్తుందని అసదుద్దీన్‌ ఓవైసీ గతంలో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా జరుగుతుందన్న సంకేతాలను ఇచ్చారు.

దేవెగౌడతో భేటీ అయిన కేసీఆర్
కేసీఆర్‌ ఇటీవలే కర్నాటకలో పర్యటించి జేడీఎస్‌ అధినేత దేవెగౌడతో భేటీ అయ్యారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లోకి రావాలని ఆహ్వానించారు. ఈ చర్చల అనంతరం కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్‌ తరపున ప్రచారం చేస్తానని కేసీఆర్‌ వెల్లడించారు. దీంతో తెలంగాణలో గులాబీ పార్టీకి పూర్తి స్థాయి అండదండలు అందిస్తున్న ఎంఐఎం కూడా తమ నిర్ణయాన్ని మార్చుకుంది. కర్నాటక ఎన్నికల్లో తామ పోటీచేసేది లేదని స్పష్టం చూస్తూనే.. తమ పార్టీ మద్దతు దేవెగౌడకు ఉంటుందని అసదుద్దీన్‌ ప్రకటించారు. తానుకూడా కర్నాటకలో బహిరంగ సభలు నిర్వహించి కాంగ్రెస్‌, బీజేపీలను ఓడించాలని ముస్లింలకు పిలుపునివ్వనున్నట్టు అసదుద్దీన్‌ వెల్లడించారు.

దేశరాజకీయాలపై ఇరుపార్టీల దృష్టి
రాజకీయంగా పాతనగరంలో పట్టున్న పార్టీగా గుర్తింపు పొందినా... పొరుగురాష్ట్రాల్లో కూడా తమ పట్టు నిరూపించుకునేందుకు ఎంఐఎం పావులు కదుపుతోంది. జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పడితే ఎంఐఎం కూడా కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని గులాబీనేతలు అంటున్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం కొత్తకూటమిపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Don't Miss