గ్యాస్ ఇస్తాం..అన్నం పెడుతాం - బాబు..

13:31 - March 20, 2017

విజయవాడ : జూన్ 2వ తేదీ వరకు అందరికీ గ్యాస్ అందిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ శాసనసభకు తెలిపారు. అంతేగాకుండా ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్ధేశ్యంతో ఎన్టీఆర్ క్యాంటీన్ పథకాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన ప్రసంగించారు. రూ. 24వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత టిడిపిదేనని స్పష్టం చేశారు. ఏ జిల్లాకు ఎంత ఇచ్చామనే దానిపై వెబ్ సైట్ లో పెట్టడం జరిగిందన్నారు. డ్వాక్రా సంఘాలు తానే పెట్టడం జరిగిందని, పసుపు..కుంకుమ పథకం కింద రూ. 10వేలు ఇవ్వడమే కాకుండా వడ్డీ మాఫీ చేయించడం జరిగిందన్నారు. మీ ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటానని గతంలో చేసిన పాదయాత్ర సందర్భంగా ముసలి వాళ్లకు తెలియచేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా రూ. 200 ఫించన్ ను రూ. 1000 చేసిన ఘనత తమదేనని, రూ. 14,682 కోట్ల రూపాయల ఫించన్ లు ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలో 45,68,329 మందికి రూ. 5,170 కోట్ల రూపాయలు ఫించన్ లు ఇచ్చామన్నారు. పేదవాళ్లందరికీ ఆహార భద్రత ఉంటూ ఇబ్బందులు కలుగకుండా ఉండాలని యోచించానని పేర్కొన్నారు. జూన్ 2వ తేదీ వరకు అందరికీ గ్యాస్ అందిస్తానని సభకు తెలిపారు. నిరుద్యోగ భృతికి రూ. 500 కోట్లు కేటాయించామని తెలిపారు.

Don't Miss