ఏపీలో చంద్రన్న పెళ్లి కానుక

07:38 - October 11, 2017

గుంటూరు : అమరావతిలోని సచివాలయంలో సుదీర్ఘంగా భేటీ అయిన ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వెనుకబడిన తరగతులకు చెందిన నూతన వధూవరులకు పెళ్లి సమయంలో ఆర్థికసాయం అందించే కొత్త పథకానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చంద్రన్న పెళ్లికానుక పేరుతో ఈ పథకం అమలుకానుంది. నూతన సంవత్సరం నుంచి ఈ పథకాన్ని ఆరంభించనున్నారు. ఈ పథకానికి తెల్లరేషన్‌కార్డు ఉన్నవారు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న బీసీ కులాలకు చెందిన వారు అర్హులు. ఈ పథకం కింద పెళ్లి సమయంలో ఒక్కో జంటకు 30వేల రూపాయలు ఆర్థికసాయంగా అందజేయనున్నారు. రాష్ట్రంలోని ఎంపిక చేసిన పాఠశాలల్లో క్లౌడ్‌ ఆధారిత వర్చువల్‌ క్లాసురూమ్స్‌ ఏర్పాటు కోసం చేపట్టే ప్రాజెక్టును అమలు చేయడానికి, ట్రీజిన్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ అనే సంస్థ ఎంపికకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ ప్రాజెక్టు వీలుకల్పిస్తుంది. డిసెంబర్‌ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రవాసుల సంక్షేమానికి ఉద్దేశించి 40 కోట్లతో ఏపీ మైగ్రెంట్స్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీకి చెందిన దాదాపు 25 లక్షల మంది ప్రవాసాంధ్రులు దీనిద్వారా ప్రయోజనం పొందనున్నారు.

పంచాయతీరాజ్‌, రెవెన్యూశాఖలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలల
పంచాయతీరాజ్‌, రెవెన్యూశాఖలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో మానవ వనరుల నియామకాలపై మంత్రిమండలిలో చర్చించారు. ఎంత మంది అవసరమో గుర్తించి ప్రతిపాదనలు సిద్దం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్లాంటేషన్‌, శాండ్‌, భారీ వర్షాలు, జల సంరక్షణ, గిరిజన ఆరోగ్యం, సీజనల్‌ వ్యాధులతోపాటు ఇతర అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ డెలివరీ గ్యారంటీ ఆర్డినెన్స్‌ -2017 డ్రాఫ్టుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వివిధ సంస్థలకు భూములను కేటాయిస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అమరావతిలో బసవతారకం క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు స్థలం కేటాయించారు. ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి, బ్రహ్మకుమారీ సంస్థ, గోపీచంద్‌ అకాడమీకి అమరావతిలో స్థలాలు కేటాయించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇక మధురవాడ సెజ్‌లో ఏఎన్‌ఎస్‌ఆర్‌ కంపెనీకి 10 ఎకరాలు కేటాయించారు. దీని ద్వారా రాబోయే ఆరేళ్లలో 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో మోడ్రన్‌ అండ్‌ స్టేట్‌ ఆఫ్ ఆర్ట్‌ టైర్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ ఏర్పాటు కోసం భూకేటాయింపు పొందిన అపోలో టైర్స్‌ లిమిటెడ్‌ కోరిన మినహాయింపులకు మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలోని కాపులుప్పాడలో ట్రైబల్‌ మ్యూజియం ఏర్పాటు కోసం 4 ఎకరాల భూమిని గిరిజన సంక్షేమ శాఖకకు అప్పగిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

Don't Miss