బిజెపిపై త్వరలో నిర్ణయమన్న బాబు..ఎప్పుడో ?

06:30 - February 3, 2018

విజయవాడ : కేంద్రబడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై అటు విపక్షాలతోపాటు ... ఇటు ప్రభుత్వంలోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. మిత్రపక్షమంటూ మౌనంగా ఉంటుంటే... రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిన్న జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీలోనూ.... కేబినెట్‌ సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వచ్చింది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని టీడీపీ నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం చేశారన్న వాదన పాలకుల నుంచి వ్యక్తమవుతోంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ, కేబినెట్‌ భేటీలోనూ వాడీవేడీగా చర్చ సాగింది. బడ్జెట్‌ ప్రకంపనలు కొనసాగాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపే విషయంలో మాత్రమే వేగంగా స్పందించిందని చంద్రబాబు అన్నారు. ఆ తర్వాత అన్నీ ఎదురు చూపులే మిగిలాయని అన్నారు. ఏపీకి తీరని అన్యాయం చేసిన మాదిరే బీజేపీ వ్యవహరిస్తోందని అన్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకుంటామని మోదీతోసహా బీజేపీ నేతలంతా హామీనిచ్చారని.. అది ఆచరణలో కనిపించడంలేదని వ్యాఖ్యానించారు.

కొంతమంది బీజేపీ నేతలు ఏపీకి అన్నీ చేశామని... ప్రతీదాన్ని తేలిగ్గా తీసేసే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు వివరించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోగా... ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి.. దానికీ ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. లోటుబడ్జెట్‌ కింద 16వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా... కేవలం 4వేల కోట్లే ఇచ్చారని చెప్పారు. రెండు యూనివర్సిటీలకు ఇంకా పార్లమెంట్‌లో బిల్లుపెట్టలేదని తెలిపారు. బెంగళూరు మెట్రోరైలు కోసం 17వేల కోట్లు ఇచ్చారని.. అమరావతికి 2వేల కోట్లు ఇచ్చి సర్దుకోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని చంద్రబాబు అన్నారు.

బీజేపీతో పొత్తుపై ఎవరూ మాట్లాడవద్దని చంద్రబాబు ఆదేశించారు. అన్ని కోణాల నుంచి ఆలోచించి అందరితో మాట్లాడి ఓ నిర్ణయానికి వద్దామన్నారు. ఇది రాజకీయ సమస్యకాదని... మన పోరాటం బీజేపీపై కాదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించుకోవాలన్నదే మన ప్రయత్నమంటూ నేతలకు సర్దిచెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై తమ తమ అభిప్రాయాలు చెప్పాలని పార్టీ నేతలను చంద్రబాబు కోరారు.

రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలనే తాము కోరుతున్నామని... చంద్రబాబు అన్నారు. అవికూడా కేంద్రం చేయడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. బీజేపీకి తాము నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్నామని.. ఢిల్లీ చుట్టూ తిరుగుతూ అందరినీ కలుస్తున్నా పనులు కావడం లేదన్నారు. ఏపీపట్ల ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో తెలియడం లేదన్నారు. మొత్తానికి కేంద్ర బడ్జెట్‌ ఏపీ ప్రభుత్వంతో అసంతృప్తిని రాజేసింది.

Don't Miss