వామపక్షాలపోరుకు మద్దతు తెలిపిన కాంగ్రెస్

21:40 - September 10, 2017

కడప : రాయలసీమ ఉక్కుపరిశ్రమ పోరాట కమిటీ ఆధ్వర్యంలో వామపక్షాలు సోమవారం కడపజిల్లాలో తలపెట్టిన సభకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని కాంగ్రెస్‌పార్టీ నేత తులసిరెడ్డి స్పష్టం చేశారు. ఈ సభలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు 6నెలల లోపున కడపజిల్లాల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే 39 నెలలు గడిచినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాల్లో ఉలుకూ పలుకూ లేదని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో స్టీల్‌ పరిశ్రమ స్థాపనకు ఆనాడు పార్లమెంటులో ఎటువంటి చట్టం చేయలేదన్న ఆయన.. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి నానా రకాల కొర్రీలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే.. 6నెలల లోపు కడపలో ఉక్కు పరిశ్రమను స్థాపిస్తామని తులసిరెడ్డి స్పష్టం చేశారు.

ఇంటింటికీ మోసం..
ఇంటింటికీ తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కుటుంబం అంటూ అధికార, ప్రధాన ప్రతిపక్షపార్టీలు మళ్లీ జనాన్ని మోసం చేయడానికి సిద్ధం అవుతున్నాయని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. ఇంటింటికీ మోసం అని పేరుపెట్టుకోవడమే ఆ రెండు పార్టీలకు కరెక్ట్‌ పదం అని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. వాస్తవానికి వైఎస్‌ రాజశేఖరెడ్డి పేరు చెప్పుకునే అర్హత జగన్‌పార్టీకి లేదని అన్నారు. రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీ నాయకుడని.. జగన్‌ తన పార్టీలో వైఎస్‌ఆర్‌ పేరును తీసేస్తే బాగుంటుందని తులసిరెడ్డి సలహా ఇచ్చారు. రాష్ట్రవిభజన తర్వాత కోలుకోలేని రీతిలో చతికిలపడిన ఏపీ కాంగ్రెస్‌.. ఇపుడు తన పోరాట పంథాను మార్చుకుంది. ప్రజా సమస్యలే ప్రాధాన్యంగా ఉద్యమిస్తున్న వామపక్షాలతో కలిసి వస్తామని కాంగ్రెస్‌నేతలు చెబుతున్నారు. అందుకే టీడీపీ, వైసీపీలను టార్గెట్‌ చేస్తూ విమర్శల దాడిని పెంచారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

Don't Miss