ఏపీలో నంది పురస్కారాలు..

08:50 - November 15, 2017

గుంటూరు : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నంది అవార్డులను  ప్రకటించింది. 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను నంది అవార్డులతోపాటు  నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య సినిమా పురస్కారాలను ప్రకటించింది. 2014 ఉత్తమ చిత్రంగా లెజెండ్‌, ఉత్తమ నటుడిగా బాలకృష్ణ నిలిచారు. 2015 బెస్ట్‌ ఫిల్మ్‌గా బాహుబలి ద బిగినింగ్‌ ఎంపికవగా.. ఉత్తమనటుడిగా మహేశ్‌బాబు నిలిచారు. ఇక 2016 బెస్ట్‌ మూవీగా పెళ్లిచూపులు చిత్రం నంది అవార్డును సొంతం చేసుకుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఉత్తమ నటుడిగా బంగారునంది వరించింది. 

రాష్ట్ర విభజన అనంతరం.. కొంతకాలం ఆగిపోయిన నందిఅవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 2014, 15, 16 ..ఇలా మూడు సంవత్సరాలకు ఒకేసారి  పురస్కారాలు ప్రకటించింది. నంది అవార్డుల కమిటీ సభ్యులు నందమూరి బాలకృష్ణ, నటి జీవిత, గిరిబాబు తదితరులు అవార్డులను ప్రకటించారు. 

2014 సంవ‌త్సరానికి ఉత్తమ చిత్రంగా లెజెండ్‌... ఉత్తమ నటుడిగా బాలకృష్ణ నిలిచారు. ఉత్తమ విలన్‌గా  లెజండ్‌ మూవీలో అదరగొట్టిన జగపతిబాబుకు నంది అవార్డు దక్కింది. ఇక  అక్కినేని ఫ్యామిలీ నటించిన మనం చిత్రం రెండో ఉత్తమ సినిమాగా నిలిచింది.  హీరో నాగ చైతన్య ఉత్తమ సహాయ నడుడిగా అవార్డు దక్కించుకున్నారు.  2014 ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా లౌక్యం మూవీ అవార్డును సొంతం చేసుకుంది ఇక 2014 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు కమల్‌హాసన్‌కు ప్రకటించగా.. నాగిరెడ్డి- చక్రపాణి  అవార్డు పీపుల్స్‌స్టార్‌ నారాయణమూర్తికి లభించింది. 

2015   బెస్ట్ ఫిల్మ్‌గా  బాహుబలి నిలిచింది. ఇక రెండో ఉత్తమ చిత్రంగా ఎవడే సుబ్రమణ్యం, 3వ బెస్ట్ ఫిల్మ్‌గా  నేను శైలజ అవార్డులను అందుకున్నాయి. ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా మళ్లిమళ్లి ఇదిరాని రోజు చిత్రం  ఎంపికయ్యాయి. అటు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం బెస్ట్‌ పాపులర్‌ చిత్రంగా అవార్డును దక్కించుకోగా.. దేశ సమైక్యతను పెంపొందించిన చిత్రంగా  కంచె  మూవీకి అవార్డు దక్కింది. ఇక ఉత్తమ నటుల విభాగంలో హీరో మహేశ్‌బాబుకు 2015 ఉత్తమ నటుడి అవార్డు దక్కగా.. బెస్ట్‌ హీరోయిన్‌గా అనుష్క నిలిచింది. బెస్ట్‌ సపోర్ట్‌ మేల్‌  రోల్‌లో పోసాని మురళీకృష్ణ అవార్డును సొంతం చేసుకున్నారు. బాహుబలి మూవీలో రాజమాతగా   అలరించిన రమ్యకృష్ణ బెస్ట్‌ ఫిమేల్‌ సపోర్ట్‌ యాక్టర్‌గా నిలిచారు.  ఇక ఎస్వీ రంగారావు క్యారెక్టర్‌ అవార్డు అల్లు అర్జున్‌ను వరించింది. రుద్రమదేవి చిత్రంలో గోనగన్నారెడ్డి పాత్రలో మెరిసిన అల్లు అర్జున్‌కు ఈ అవార్డు ప్రకటించారు. అటు అల్లు రామలింగయ్య అవార్డును భలేభలే మగాడివోయ్‌ చిత్రానికి గాను వెన్నెల కిషోర్‌కు  నంది అవార్డు దక్కింది. ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు-కె.రాఘవేంద్రరావుకు, బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు దక్కాయి. ఇక బెస్ట్‌ విలన్‌గా దగ్గుబాటి రానా బంగారు నందిని అందుకోనుండగా.. దర్శకుడు రాజమౌళికి బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డును ప్రకటించారు.  బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా  కీరవాణి, బెస్ట్  డాన్స్ మాస్టర్‌గా ప్రేమ్ రక్షిత్ అవార్డులను సొంతం చేసుకున్నారు. అటు బెస్ట్ ఫస్ట్ ఫిలిం డైరెక్టర్‌ విభాగంలో నాగ అశ్విన్, బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో   కిశోర్‌  తిరుమలకు  నందిఅవార్డులు దక్కాయి. గౌతమీపుత్రశాతకర్ణి మూవీకి స్టోరీ అందించిన క్రిష్‌కు బెస్ట్‌ స్టోరీ రైటర్‌గా అవార్డు లభించగా.. ఉత్తమ డైలాగ్‌ రైటర్‌గా  బుర్రా  సాయి మాధవ్ , బెస్ట్‌ లిరిక్‌ రైటర్‌గా రామజోగయ్యశాస్త్రి, అలాగే  ఫిమేల్‌ సింగర్ విభాగంలో  చిన్మయికి అవార్డు లభించింది. ఇక బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌గా కేకేసెంథిల్‌ కుమార్‌ బంగారునందిని అందుకోనున్నారు. మొత్తానికి 2015లో బాహుబలి దబిగినింగ్‌ మూవీకి అవార్డుల పంటపండింది. 

ఇక 2016 సంవ‌త్సరానికి ఉత్తమ చిత్రంగా పెళ్లిచూపులు , ఉత్తమ నటుడుగా- జూనియర్‌ ఎన్టీఆర్‌ నిలిచారు. 2016 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డును సౌత్‌ఇండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ప్రకటించారు. ఇక 2016  బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డును దర్శకుడు  బోయపాటి శ్రీనివాస్‌ దక్కించుకున్నారు. 

Don't Miss