నిరుద్యోగ భృతి మళ్లీ తెరపైకి

17:33 - May 13, 2018

విజయవాడ : నిరుద్యోగ భృతి అంశం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.రానున్న ఎన్నికలకోసం టీడీపీ ఎత్తుగడవేస్తోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.  నిరుద్యోగ భృతి కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం అన్న చందంగా ఉందంటూ వామపక్షాలు మండిపతున్నాయి.
2019 ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ అడుగులు
2019లో ఎన్నికల దృష్ట్యా టీడీపీ గతంలో ఇచ్చిన కీలక హామీలపై దృష్టిసారిస్తోంది. అందులో భాగంగానే నిరుద్యోగ భృతిని మళ్లీ తెరపైకి తెచ్చారు. కానీ.. నిరుద్యోగ భృతిలో పరిమితులు విధిస్తూ ప్రభుత్వం కొందరికి మాత్రమే అందిస్తామనడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ఇచ్చిన మాటమీద నిలబడి నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి కల్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం యోచన 
ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి సాంకేతిక విద్యనభ్యసించిన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించి.. ఉపాధి కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిరుద్యోగ భృతి కోసం ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పరిమితికి మించి దరఖాస్తులు వస్తే ఆ  పలు ప్రభుత్వ ఆర్థిక సంస్థలతో రుణాలు మంజూరు చేయించి.. ఉపాధి కల్పించాలని చూస్తోంది ప్రభుత్వం. 
10 లక్షల మందికి నిరుద్యోగ భృతి : యనమల 
డిగ్రీ తర్వాత ఉన్నత విద్యనభ్యసించే వారిని, ప్రభుత్వ శాఖల్లో ఒప్పంద, పొరుగు సేవల కింద పని చేస్తున్నవారిని, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల్లో పనిచేస్తున్నవారిని నిరుద్యోగ భృతికి అనర్హులుగా గుర్తించాలని ఉప సంఘంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా 10 లక్షల మందికి నిరుద్యోగ భృతిని కల్పించాలని చూస్తున్నామని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణ తెలిపారు. దీన్ని నిత్యం కొనసాగించి, యువతకు ఉపాధి కల్పించేలా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. విధివిధానాలను ఖరారు చేసి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆర్థికమంత్రి చెప్పారు.. 
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే టీడీపీ నిరుద్యోగ భృతన్న విమర్శలు   
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే టీడీపీ నిరుద్యోగ భృతి అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యువత ఓట్లను ఆకర్షించేందుకు నిరుద్యోగ భృతిపై దృష్టిసారించిందని వామపక్షాలు తప్పుబడుతున్నాయి. 2017లోనే  ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది బడ్జెట్ లో  500 కోట్లు, 2018లో  వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు.  ఆ తర్వాత పలు కారణాలతో నిరుద్యోగ భృతి అంశాన్ని అటకెక్కించారు. ఏడాదిలో రానున్న ఎన్నికల్లో నిరుద్యోగుల ఓట్లు కొల్లగొట్టేందుకే టీడీపీ ఎత్తుగడవేస్తోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.  టీడీపీ ఈ విధంగా ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకోవడం సరైంది కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
అందరికీ నిరుద్యోగ భృతి అందివ్వాలి : వామపక్షాలు  
నిరుద్యోగ భృతి కొందరికే అంటూ కొత్తపల్లవి అందుకోవడం సరైందికాదని వామపక్ష నేతలు టీడీపీ వైఖర్ని తూర్పారబడుతున్నారు. టీడీపీ ఇప్పటికైనా ఇచ్చిన హామీల అనుగుణంగా అందరికీ నిరుద్యోగ భృతి అందివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు. 

 

Don't Miss