జీవో నెం.64 రద్దు

19:21 - September 10, 2017

గుంటూరు : వ్యవసాయ శాఖలో వివాదాస్పదమైన జీవో నెంబర్ 64 ను.. ఏపీ ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల నుండి వ్యతిరేకత రావడం, గత రెండు నెలలుగా వ్యవసాయ విద్యార్థులు ఆందోళన చేస్తుండడంతో.. ప్రభుత్వం జీవోను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా నవ్యాంధ్రలో వ్యవసాయ విద్యార్థులు చేస్తున్న.. ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చింది. కొంతమంది పొరుగు రాష్ట్రాల్లో అనుమతి లేని కాలేజ్ నుండి పట్టాలు పొంది.. వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు పొందారు. వారికి అనుకూలంగా ప్రభుత్వం జీవో నెంబర్‌ 64ను తీసుకొచ్చిందని ఆరోపిస్తూ.. గత రెండు నెలలుగా రాష్ట్రంలోని 11 వ్యవసాయ కళాశాలల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. జీవో నెంబర్ 64 కారణంగా రాష్ట్రంలో గుర్తింపున్న కాలేజ్‌లో చదివిన విద్యార్థులకు నష్టం జరుగుతుందని.. దానిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేశారు. విద్యార్థుల ఆందోళనతో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. 64 జీవోను రద్దు చేస్తామని ప్రకటించారు. 

Don't Miss