బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర మోక్షమెప్పుడు..

19:24 - September 10, 2017

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడ నగరంలో.. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కానీ పనులు వేగవంతం చేసే విషయంలో టెండర్ల ప్రక్రియ ఆటంకంగా కనిపిస్తోంది. ఓవైపు కాంట్రాక్ట్ సంస్థ పనులు చేస్తుండగా, వంతెన పొడవు మారడంతో.. అసలు సమస్య మొదలైంది. బందరు-విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా చేపట్టిన ఈ వంతెనను 740కోట్ల అంచనావ్యయంతో చేపట్టారు. దిలీప్ కాన్ సంస్థ ఈ పనులు చేపట్టింది. అయితే కొత్తగా పెంచిన వంతెన పొడవు పనులను ప్రధాన గుత్తేదారుగా ఉన్న దిలీప్‌ కాన్‌ సంస్థకు అప్పగించకుండా.. ఎన్‌హెచ్‌ఎఐ మరో ఈపీసీ టెండర్‌ పిలవడం చర్చనీయాంశంగా మారింది.మారిన పొడవుకు ఈపీసీ కింద టెండర్ పిలవాలని నిర్ణయించారు. పార్టు-1 బీఓటీ కింద, పార్టు-2 ఈపీసీ కింద ఎలా నిర్మాణం చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది. అయితే ప్రజా ప్రతినిధులు మాత్రం 18 నెలల్లో ఫ్లై ఓవర్‌ను పూర్తి చేసి 2018 కల్లా అందుబాటులోకి తెస్తామని హామీ ఇస్తున్నారు. అయితే ఇప్పటికీ టెండర్లు పిలవకపోవడంతో 18 నెలల్లో ఈ పనులు పూర్తవ్వడం సాధ్యం కాదనే భావన అధికారులలో వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ విషయమై నగరవాసులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

Don't Miss