ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై అనుమానాలు

16:50 - September 13, 2017

విజయవాడ : ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల నిర్వహణపై... అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం  పనులైతే ప్రారంభమయ్యాయి కానీ.. నిధులు జాడ మాత్రం కానరావడం లేదు.  పాలక మండలి ప్రతిపాదనలు పంపినా... నేటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో ఉత్సవాల నిర్వహణపై అయోమయం నెలకొంది.  
నిధులు విడుదల చేయని ప్రభుత్వం
విజయవాడ... ఇంద్రకీలాద్రిపై ప్రతి ఏటా వైభవంగా జరిగే దసరా ఉత్సవాలు ఈ ఏడాది ఏ విధంగా జరగుతాయోననే... సందేహం వ్యక్తమవుతుంది. దసరాను పురస్కరించుకుని... శ్రీ కనకదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకూ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పనులు కూడా చేపట్టారు.  కానీ ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకూ నిధులు విడుదల చేయలేదు.  
దసరా ఉత్సాలకు రూ.15 కోట్ల ఖర్చవుతుందని అంచనా
ఈ ఏడాది దసరా ఉత్సవాలకు సుమారు రూ.15 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన ఆలయ అధికారులు... కనీసం 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని దేవస్థానం అధికారులు.. ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు పాలక మండలి తీర్మానం  చేసి ప్రభుత్వానికి పంపించారు. 
దర్శనం టికెట్‌ ధరలను తగ్గించాలని ప్రతిపాదనలు
అలాగే... పాలకమండలి ఆలయంలో దర్శనం టికెట్‌ ధరలను తగ్గించాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. ఆలయ చైర్మన్‌ గౌరంగబాబు, ఈవో సూర్యకుమారి ఆధ్వర్యంలో దర్శనం టికెట్‌ ధరను రూ.300ల నుంచి రూ.150లకు... ముఖమండప దర్శనం టికెట్ ధరను వంద రూపాయల నుంచి 50 రూపాయలకు తగ్గించాలని సభ్యులు తీర్మానం చేశారు. ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపారు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇప్పటికైనా త్వరితగతిన ప్రభుత్వం స్పందించి ఆలయ అంతరాలయ టికెట్ల ధరలను తగ్గించాలని... ఉత్సవాలకు నిధులు విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. అలాగే ఉత్సవాల నిధులతో పాటు...ఈ పదిరోజుల పాటు పని చేసే వివిధ శాఖల అధికారులకు అయ్యే మూడు కోట్ల రూపాయలను ప్రభుత్వమే అందిస్తే... ఆలయంపై భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. వీటిపై ప్రభుత్వం నుంచి స్పష్టత ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.

 

Don't Miss