గంజాయి సాగుపై ఏపీ ఉక్కుపాదం

08:09 - August 7, 2017

విశాఖ : ఆంధ్రా- ఒడిషా సరిహద్దు ప్రాంతంలో గంజాయి విస్తారంగా సాగవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి ఎక్కడ బయటపడ్డ దాని మూలాలు ఏవోబీ ప్రాంతంతోనే ముడిపడి ఉంటున్నాయి. ఇక్కడ విస్తారంగా సాగు చేస్తున్న గంజాయి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల మీదుగా దేశ, విదేశాలకు అక్రమంగా రవాణా అవుతున్నది . అధికారిక లెక్కల ప్రకారమే ఈ ప్రాంతంలో దాదాపు 150 నుంచి 200 గ్రామాల్లో గంజాయి సాగవుతుందట. ఏటా వందల ఎకరాల్లో సాగు చేస్తూ సుమారు ఐదు వేల టన్నుల గంజాయిని ఉత్పత్తి చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఏవోబీ ప్రాంతంలో సాగవుతున్న గంజాయిని, దాని అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. పోలీస్‌, ఎక్సైజ్‌శాఖలు చేస్తున్న ప్రయత్నాలు వివిధ కారణాలతో సఫలీకృతం అవ్వడం లేదు. గంజాయితోపాటు, దాని ద్వారా తయారు చేస్తున్న నల్లమందు, లిక్విడ్‌ గంజాయి వినియోగం విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు లాంటి పట్టణాల్లో ఎక్కువవుతోంది.

ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌
గంజాయిని కూకటివేళ్లతో ఇప్పటికైనా పెకిలించకపోతే రానున్న రోజుల్లో దీని పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశముంది. ఎక్కువగా యువత దీనికి బానిసలయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే... గంజాయి నిర్మూలనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నివారణకు ఏర్పాటు చేసినట్లుగానే గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని డిసైడ్‌ అయ్యింది. పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖల్లో ఇప్పటికే పనిచేస్తున్న యువకులతోపాటు, అవసరమైతే మరికొంతమందిని కొత్తగా రిక్రూట్‌ చేయనున్నట్టు తెలుస్తోంది. ఎస్‌టీఎఫ్‌లో సుమారు వెయ్యి మందిని నియమించనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మూడేళ్లలో ఏవోబీలో గంజాయి సాగు, రవాణాను నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్‌టీఎఫ్‌కు ప్రభుత్వం టార్గెట్‌ పెట్టింది. మూరుమూల ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు జరపడం, గంజాయి పంటను, నిల్వలను ధ్వంసం చేయడం, గంజాయి రవాణాకు వినియోగిస్తున్న మార్గాలు, ట్రాన్సిట్‌పాయింట్‌లపై నిఘా ఉంచాలని ఎస్‌టీఎఫ్‌ భావిస్తోంది.

ఒడిశా సరిహద్దులో
గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలించకుండా కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపట్టడం ఎస్‌టీఎఫ్‌ ప్రధాన కర్తవ్యం. ఇందుకోసం కీలక ప్రాంతాల్లో పది ఎస్‌టీఎఫ్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తారు. విశాఖ జిల్లాలో నాలుగు, తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు, ఒడిశా సరిహద్దులో రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎస్‌టీఎఫ్‌కు ఆధునిక ఆయుధాలు, అధునాతన గాలింపు పరికరాలు వంటివి ప్రభుత్వం సమూకూర్చనుంది. గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే గాజువాక సమావేశంలో బహిరంగంగానే చెప్పారు. గంజాయి క్రమంగా విస్తరిస్తోందని... విద్యాసంస్థల్లోకి పాకుతోందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అందుకే గంజాయిని అరికడితేనే విద్యార్థుల భవిష్యత్‌ బాగుంటుందని తెలిపారు.ఏపీలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా సర్కార్‌ పావులు కదుపుతోంది. మరి ప్రభుత్వ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

Don't Miss