మచిలీపట్నం పోర్టు ..నోటిఫికేషన్ గడువు పెంచిన సర్కార్

12:54 - September 2, 2017

హైదరాబాద్ :మచిలీపట్నంలో పోర్టు పనులు ప్రారంభం కాకుండానే భూదందా మొదలైంది. బందరు పోర్టు కోసం రైతులపై ఒత్తిడి తెచ్చి భూములు తీసుకునేందుకు.. సర్కార్‌ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. తీరంలో అలజడి రేగింది. రైతుల భూములను ఎలాగైనా తీసుకునే ప్రయత్నాల్లో భాగంగా.. ప్రభుత్వం నోటిఫికేషన్ల గడువును పొడగిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.

వ్యూహాత్మకంగా ముందుకెళ్తోన్న ప్రభుత్వం

మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభం కాకుండానే.. భూముల విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. అందులో భాగంగా భూ సేకరణ, భూ సమీకరణ నోటిఫికేషన్‌ గడువును మరో ఏడాది పొడగించింది. ఈ మేరకు కృష్ణాజిల్లా కలెక్టర్‌ బి. లక్ష్మీకాంతం 2017 ఆగస్టు 28న ఉత్తర్వులు జారీ చేశారు. పోర్టు, పారిశ్రామిక కారిడార్ నిర్మాణం పేరుతో.. మచిలీపట్నం నియోజకవర్గం 1.05 లక్షల ఎకరాలను సమీకరించనున్నట్లు సర్కార్‌ ప్రకటించింది. దీంతో ఎంతో విలువైన భూములను, నేలతల్లినే నమ్ముకొని జీవిస్తున్న రైతుల బతుకులు ఛిద్రం కాకుండా.. వామపక్షాలు రైతులతో కలిసి పోరాటం చేస్తున్నాయి.

పోర్టు నిర్మాణం కోసం 5, 324 ఎకరాలు

బందరుపోర్టు నిర్మాణం కోసం 5, 324 ఎకరాలు అవసరమని.. 2012లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి జీవో 11ను జారీ చేశారు. 2014లో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ 2015 ఆగస్టు 29న 33 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో రైతులకు సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌, వైసీపీ, ఇతర ప్రజా సంఘాలు రైతులతో కలిసి ఉద్యమించాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

3, 014 ఎకరాలను సమీకరించామన్న పాలకులు

పోర్టు నిర్మాణానికి 3, 014 ఎకరాలను ప్రభుత్వం సమీకరించినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడం.. చర్చనీయాంశంగా మారింది. 2017 మార్చి 28న పోర్టు నిర్మాణం నిర్వహించే ప్రాంతంలోని ఆరు గ్రామాల పరిధిలో.. 3, 014 ఎకరాలను సమీకరించామని పాలకులు చెప్పుకొస్తున్నారు. పారిశ్రామిక కారిడార్ కోసం 21 గ్రామాల్లో 12,144.86 ఎకరాలు అవసరమని నిర్ధారించారు. దీంతో అవసరానికి మించి కావాలని భూసేకరణ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 

Don't Miss