వీఎంసీ స్థలాల ప్రైవేటీకరణే ఎజెండా..

19:20 - May 16, 2018

విజయవాడ : ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాల ప్రైవేటీకరణే ప్రధాన అజెండాగా విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ సమావేశం గురువారం జరుగనుంది. ఈ భేటీకి 36 అంశాలతో అజెండా రూపొందించారు. వీటిని ఆమోదించుకునేందుకు పాలక టీడీపీ ముమ్మరం ప్రయత్నం చేస్తోంది. మరోవైపు వీఎంసీ స్థలాల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశానికి రంగం సిద్ధమైంది. గురువారం జరిగే భేటీలో వీఎంసీ ఆస్తుల ప్రవేటీకరణపై చర్చ జరుగునుంది.

పీపీపీ పద్ధతిలో కార్పొరేషన్‌ స్థలాల ప్రైవేటీకరణ
ఆదాయ మార్గాల అన్వేషణపై దృష్టి పెట్టిన విజయవాడ నరగపాలక సంస్థ అధికారులు.. కార్పొరేషన్‌ స్థలాల ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేశారు. వీఎంసీ స్థలాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో కొర్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు అజెండా రూపొందించారు. ఇప్పటికే ప్రైవేటు వక్య్తుల చేతుల్లోకి వెళ్లిపోయిన స్థలాలకు అటు అద్దెరాక.. ఇటు కోర్టు కేసుల నుంచి విముక్తి లభించక సతమతమవుతున్న నగరపాలక సంస్థ ఇప్పుడు కొత్త స్థలాల ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోంది. లబ్బీపేటలోని బృందావన్‌ అపార్ట్‌మెంట్స్‌, సింగ్‌నగర్‌లోని డిస్నీల్యాండ్‌ వివాదాల్లో చిక్కుకున్నాయి.

కబేళాలో 45,530 చదరపు గజాల స్థలం..
నగరపాలక సంస్థకు విలువైన స్థలాలు ఉన్నాయి. కబేళాలో 45 వేల 530 చదరపు గజాల స్థలంతోపాటు మున్సిపల్‌ గెస్ట్‌ హౌస్‌ ప్రాంతంలో పైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మించేందుకు ఓ కార్పొరేట్‌ సంస్థకు అప్పగిచేందుకు వీఎంసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిపై గురువారం జరిగే సమావేశంలో తీవ్ర దుమారం చెలరేగే అవకాశం ఉంది. ఇంతకు ముందు జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో కూడా దీనిపై రచ్చ జరిగింది. కార్పొరేషన్‌ స్థలాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెడితే ఉద్యమం తప్పదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. నగరపాలక సంస్థ స్థలాలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని కాంగ్రెస్‌ నాయకులు హెచరిస్తున్నారు. పాలకపక్షం ప్రైవేటీకరణ యత్నాలను తిప్పికొడతామంటున్నారు. స్థలాల ప్రైవేటీకరణే ప్రధాన అజెండాగా గురువారం జరిగే నగరపాలక సంస్థ సమావేశంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. 

Don't Miss