ఏపీ రాజధాని ప్రజల దాహార్తి తీర్చడంపై ప్రభుత్వం దృష్టి

07:31 - June 12, 2018

విజయవాడ : నవ్యాంధ్ర రాజధానికి భవిష్యత్‌లో తాగునీటి కష్టాలు ఎదురుకాకుండా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. కృష్ణానది చెంతనేగల వైకుంఠపురం దగ్గర..  బ్యారేజ్‌ నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులకు ఆమోదం తెలిపింది. త్వరలోనే వాటర్‌ స్టోరేజ్‌ వంతెన నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
నీటి సమస్య ఎదురుకాకుండా ఉండేలా ప్రణాళికలు సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు నగర ప్రజలకు రాబోయే రోజుల్లో దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మున్ముందు అక్కడ నీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా.. కృష్ణానదిపై నూతన బ్యారేజ్‌ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.  ఇందుకోసం 2,169 కోట్ల మేర అనుమతులు కూడా జారీ చేసింది. రవాణాపరంగా ఈ ప్రాంతం కీలకం కావడం.. బ్యారేజ్‌ నిర్మాణానికి సహజసిద్ధంగా అనుకూలంగా ఉండడంతో కొత్త బ్యారేజీ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. బ్యారేజీ ఆకృతులు రూపొందించి... పనులకు టెండర్లు పిలవడానికి జలవనరులశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ బ్యారేజీ నిర్మాణమైతే... దాదాపు 10 టీఎంసీల నీరు నిల్వ ఉంచేందుకు అవకాశం ఉంటుంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన 23 కిలోమీటర్ల దూరంలో వైకుంఠపురం దగ్గర బ్యారేజీ నిర్మిస్తే కొన్ని కిలోమీటర్ల మేర నీరు పుష్కలంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
గని ఆత్కూరు, వైకుంఠపురం గ్రామాల మధ్య బ్యారేజీ నిర్మాణం
కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ కంచికచర్ల మండలం గనిఆత్కూరు, గుంటూరు జిల్లాలో వైకుంఠపురం గ్రామాల మధ్య కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి గతంలోనే ప్రాథమిక సర్వే పూర్తి చేశారు. ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర విభజనతో నీటి అవసరాల కోసం ఈప్రాంతంలో బ్రిడ్జి కమ్‌ బ్యారేజీ నిర్మాణానికి డిమాండ్‌ ఏర్పడింది.  ప్రస్తుతం రాజధానిలో నీటి అవసరాలు ఆశించినంతగా లేకపోవడంతో ప్రకాశం బ్యారేజీలో రాజధాని అవసరాలకు తగ్గట్టుగా వాటర్‌ స్టోరేజీకి మరో బ్యారేజీ నిర్మాణ అవసరం ఏర్పడింది. వర్షాకాలంలో దిగువ ప్రాంతంతోపాటు మున్నేరు నుంచి వచ్చే వరద నీటి ఆధారంగా ఈ బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 10 టీఎంసీల నీటినిల్వ, 50 లక్షలమందికి తాగునీరు, రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లక్ష్యంగా ఈ బ్యారేజీకి ప్రభుత్వం రూపకల్పన చేసింది.
బ్యారేజీ నిర్మాణానికి రూ. 2,169 కోట్లు ఖర్చు
బ్యారేజీ నిర్మాణానికి  దాదాపు 2,169 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో భూసేకరణకు 771 కోట్లు కేటాయించారు. బ్యారేజీ నిర్మాణ పనులకు 1088 కోట్లు, నావిగేషన్‌ పనులకు 88 కోట్లు, భవనాల నిర్మాణానికి మరో 11 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు.  నూతన బ్యారేజీ నిర్మాణం జరిగిన వెంటనే 10 టీఎంసీల నీటిని అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోవచ్చు.

 

Don't Miss