ఫలించిన దేవరపల్లి దళితుల పోరు

21:55 - August 7, 2017

ప్రకాశం : దేవరపల్లి దళితుల పోరు ఫలించింది. వీరి భూమిని లాక్కోవాలని భావించిన పాలకులు వెనక్కి తగ్గారు. దశాబ్దాలుగా దళితుల స్వాధీనంలోని భూమిని వారికే అప్పగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై.. దేవరపల్లి దళితులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు తొలి నుంచీ అండగా ఉన్న సీపీఎం రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. 
ఎట్టకేలకు కదిలిన ప్రభుత్వం  
ప్రకాశం జిల్లా దేవరపల్లికి చెందిన దళితులు రెండేళ్లుగా సాగిస్తున్న పోరాటం.. ఎట్టకేలకు ప్రభుత్వాన్ని కదిలించింది. నీరు-మట్టి పథకం కింద చెరువు తవ్వేందుకు, దశాబ్దాలుగా 40 మంది దళితులు సాగు చేసుకుంటున్న 22 ఎకరాల భూమిని లాక్కోవాలని స్థానిక ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ప్రయత్నించారు. అయితే.. దళితులు, వారికి దన్నుగా సీపీఎం నేతలు... చేసిన ఉద్యమాలతో.. ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దళితుల భూములను తీసుకోబోమని ప్రకటించింది. 
భూమిని లాక్కునేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం
దేవరపల్లి గ్రామంలో.. మాలల నీటి కటకట చూడలేక, వందేళ్ల క్రితం క్రిష్ణంరాజు అనే దాత 42 ఎకరాల భూమిని, చెరువు తవ్వకం కోసం గ్రామ మాలలకు అంకితమిచ్చారు. అయితే వివిధ కారణాల వల్ల.. చెరువు తవ్వకం సాగలేదు. ఈ క్రమంలో 1966లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు ప్రోత్సహించే క్రమంలో.. ఈ భూమిని ఇందిరమ్మ సర్కారు దళితులకు నజరానాగా ఇచ్చింది. ఎకరా, అర ఎకరా లెక్కన 22 ఎకరాలను 40 మంది రైతులకు అందించారు. దీనిపై కన్నేసిన ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు నీరు-మట్టి పథకం కింద చెరువు తవ్వే వంకతో దళితులకు భూమిని దూరం చేసే ప్రయత్నం చేశారు. తమ గోడు గురించి జిల్లా అధికారులందరికీ ఎన్ని విన్నపాలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో.. దేవరపల్లి దళితులు సీపీఎం జిల్లా శాఖను ఆశ్రయించారు. వాస్తవాలు తెలుసుకునేందుకు.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.. రెండు సార్లు ఈ గ్రామానికి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుని రెండుసార్లూ అరెస్టు చేశారు.  
దళితుల పక్షాన సీపీఎం పోరాటం 
అరెస్టులు.. నిర్బంధాలకు వెరవని.. సీపీఎం నాయకత్వం.. దేవరపల్లి దళితుల పక్షాన అలుపెరుగని పోరాటం కొనసాగించింది. ఈ క్రమంలోనే బలవంతంగా, గ్రామంలోకి మీడియా సహా మరెవరినీ రానీయకుండా, దళితుల భూముల్లో చెరువు తవ్వే ప్రయత్నం చేశారు. దీంతో.. బాధితులు జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్‌ దృష్టికీ తమ వేదనను తీసుకు వెళ్లారు. ఒకటి రెండు రోజుల్లో కమిషన్‌ ఈ గ్రామాన్ని సందర్శించనుందన్న సమాచారం నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ భూములను దళితులకే వదిలిపెడుతున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్వాగతించారు. భూములు కోల్పోతామేనన్న ఆందోళనలో ఉన్న దేవరపల్లి దళితులు కూడా.. ప్రభుత్వ తాజా నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Don't Miss