టీడీపీకి ఎమ్మెల్సీ టిక్కెట్ ఆశావహుల బెడద

06:52 - February 17, 2017

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగడంతో ఆశావహుల బెడద అధికార పార్టీని తాకుతోంది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబుకు తాము అన్ని విధాలా తోడుగా ఉన్నామని ఆశావహులు చెబుతున్నారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు వస్తున్న మీకోసం పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర విజయానికి కృషిచేసిన నేతలు ఇపుడు ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారు.

పాదయాత్రలో పనిచేసిన వాళ్లకి ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు...

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి రాగానే పాదయాత్రలో తనతోపాటు పనిచేసిన వాళ్లకి ప్రాధ్యానత కల్పించారు చంద్రబాబు. వారిలో గరికపాటి మోహన్ రావును ఎన్నికలకు ముందే రాజ్యసభకు పంపారు. అలాగే కంభంపాటి రామ్మోహన్, పిఆర్ మోహన్, వివివి చౌదరి, టిడి జనార్థన్, గోనుగుంట్ల కోటేశ్వరరావు, జయరామిరెడ్డి, బీద రవిచంద్ర, నన్నపనేని రాజకుమారి లాంటి నేతలకు సముచిత స్థానం కల్పించారు.

ఇప్పటికీ పదవుల కోసం కొంత మంది నేతల ఎదురుచూపులు .....

అయితే కొంత మంది మాత్రం ఇప్పటికి ఎలాంటి అవకాశం రాక పదవుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలు అవుతుండటంతో, తమ పేర్లను పరిశీలించాలని అధినేత చంద్రబాబుకు గుర్తుచేస్తున్నారు. మంతెన సత్యనారాయణ రాజు, జేఆర్ పుష్పరాజ్, శోభా హైమావతి, చందు సాంబశివరావు, దాసరి రాజమాస్టార్, కొమ్మినేని వికాస్, పిన్నమనేని సాయిబాబా లాంటి నేతలు ఎమ్మెల్సీ స్థానాలు ఆశిస్తున్నారు.

గతంలో ఎమ్మెల్సీ అవకాశం కోల్పోయిన మంతెన ......

పార్టీకి తాము చేస్తున్న సేవలను కూడా గుర్తుచేస్తున్నారు ఆశావహులు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మంతెన సత్యనారాయణ రాజుకు గతంలో ఎమ్మెల్సీ స్థానం చేజారడంతో మరోసారి అవకాశం కల్పిస్తానని ఇంతకుముందే చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని మంతెన కోరుతున్నారు. ఇక బ్రాహ్మణ కోటాలో టీటీడీ బోర్డు సభ్యుడు ఏవి రమణ ఎమ్మెల్సీ స్థానం ఆశిస్తున్నారు. అదే విధంగా సత్యవాణి, మదిపట్ల సూర్యప్రకాశ్, బ్రహ్మం చౌదరి, పరుచూరి క్రిష్ణా, డాక్టర్ పవన్‌లు కూడా ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

అధికారంలోకి వచ్చి మూడేళ్ళు గడుస్తుండడంతో ...

పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు గడుస్తుండడంతో ఇప్పటికైనా తమకు అవకాశం కల్పించాలని పాదయాత్రలో పాల్గొన్న నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. పదవులు కోరుకుంటున్న నేతలు ఎక్కువగా ఉండటంతో ఎవరికి అవకాశం కల్పించాలన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Don't Miss