ఎమ్మెల్సీ..కౌంటింగ్ స్టార్ట్...విజేత ఎవరో..

08:12 - March 20, 2017

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో మూడు స్థానిక సంస్థలు, మూడు పట్టభద్రులు, రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కడప స్థానిక బరిలో టిడిపి నుండి బీటెక్ రవి, వైసీపీ నుండి వైఎస్ వివేకానందరెడ్డి, కర్నూలు స్థానిక బరిలో టిడిపి నుండి చక్రపాణి, వైసిపి నుండి గౌరు వెంకటరెడ్డి, నెల్లూరు స్థానిక బరిలో టిడిపి నుండి వాకాటి నారాయణ, వైసీపీ నుండి ఆనం విజయకుమార్ రెడ్డి బరిలో ఉన్నారు.

నెల్లూరులో..
నెల్లూరు జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో 852 ఓట్లకు గాను 851 ఓట్లు పోలయ్యాయి. ఆరు టేబుల్స్..నాలుగు బాక్స్ లను ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న ప్రాంతం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

కడపలో...
కడపలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కలెక్టరేట్ కార్యాలయంలో కౌంటింగ్ జరగనుంది. నగరంలో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయోత్సవ ర్యాలీలకు..బాణాసంచా కాల్చరాదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. రెండు..మూడు గంటల్లో విజయం ఎవరిదో తేలనుంది.

కర్నూలులో..
కర్నూలులో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ స్టేషన్ వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల పోలింగ్ లో 1077 ఓట్లు పోలయ్యాయి. విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ, టిడిపి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

Don't Miss