'సిక్కోలు' జపం చేస్తున్న నేతలు..

13:26 - August 2, 2018

శ్రీకాకుళం : రాజకీయ అగ్రనేతలంతా శ్రీకాకుళం ప్రజల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్.. వెనువెంటనే జేడీ లక్ష్మీనారాయణ, ఆ తర్వాత బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ.. ఆపై వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి.. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు.. సిక్కోలులో చక్కర్లు కొడుతున్న నేతల తీరుపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం.. శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు కాక మీదున్నాయి. రాజకీయ పార్టీల అగ్రనేతలంతా ప్రజల ముందు బారులు తీరుతున్నారు. నేతల వరుస పర్యటనలు, ముందస్తు ప్రణాళికలతో రాజకీయ వేడి రాజుకుంటోంది. రాజకీయ నేతల విన్యాసాలకు సిక్కోలు వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. నాయకులు సుడిగాలి పర్యటనల్లో స్థానిక సమస్యల్నే ప్రధాన ఎజెండాగా చేసుకోవడం గమనార్హం.

జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చాపురం నుంచి ఎచ్చర్ల వరకూ నిరసన పోరాట యాత్ర చేశారు. ఏ పార్టీ జెండా లేకుండానే మాజీ ఐ.పి.ఎస్. అధికారి జేడీ లక్ష్మీనారాయణ 3 రోజులు పర్యటించారు. ఏపీలో బీజేపీ పగ్గాలు చేపట్టిన కన్నా లక్ష్మినారాయణ సైతం ఇక్కడ నుంచే పర్యటనలు ప్రారంభించారు. ఇక వైసీపీ కూడా సమస్యలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వంపై విమర్శల దూకుడు పెంచింది. సమన్వయకర్తల మార్పు, కన్వీనర్ల పనితీరు మెరుగుపరచడంలో భాగంగా విజయసాయిరెడ్డి పర్యటించారు. ఆగస్టులో జగన్ జరిపే ప్రజా సంకల్ప యాత్రను విజయవంతం చేసేందుకు ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నారు. మొత్తానికి వీరంతా ఈ పర్యటనల్లో చేరికలు, గెలుపోటములపై సమీక్షలు జరిపారు.

నేతలంతా అధికార పార్టీనే టార్గెట్‌ చేస్తుండడంతో.. సీఎం చంద్రబాబు సైతం శ్రీకాకుళం జిల్లా నుంచే విపక్షాల తీరును ఎండగట్టారు. 3 నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 10 అసెంబ్లీ స్థానాలు, మరో పార్లమెంట్ స్థానంలో బలంగా ఉన్నామంటున్న టీడీపీ నేతలపై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. ఐక్యంగా పనిచెయ్యాలంటూ చంద్రబాబు గట్టిగానే హెచ్చరిస్తున్నారు. అన్ని పార్టీల అగ్రనేతలు సిక్కోలులో సుడిగాలి పర్యటనలు చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ప్రెస్ మీట్‌లకే పరిమితమవుతోంది. జిల్లాలో ప్రధాన సమస్యలపై వామపక్షాలు సైతం ఉద్యమిస్తుంటే.. కాంగ్రెస్ కేడర్ కోసం వెదుకులాడుతోంది. మొత్తానికి రాజకీయ నాయకులంతా పర్యటనలతో హడావిడి చేస్తుంటే.. ప్రజలు మాత్రం మౌనంగా గమనిస్తున్నారు. 

Don't Miss