ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు..ముగిశాయి..

09:14 - March 10, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 9 జిల్లాల పరిధిలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 69.70 శాతం పోలింగ్‌ నమోదైంది. విశాఖ నగరంలో 71.1 శాతం, ఏజెన్సీలో 70 శాతం పోలింగ్‌ నమోదైంది. శ్రీకాకుళంలో 68 శాతం, విజయనగరంలో 70 శాతం పోలింగ్‌ రికార్డైంది. చెదురుమదురు ఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా ప్రాంతాల్లో గ్రాడ్యుయేట్లు, టీచర్లు పోటిపడ్డారు.

విశాఖలో..
విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. నగరంలో తన ఓటు హక్కును పీడీఎఫ్ అభ్యర్థి అజశర్మ వినియోగించుకున్నారు. నర్సీపట్నం మున్సిపాల్టీ ఛైర్మన్‌ చింతకాయల అనిత, వైఎస్‌ ఛైర్మన్‌ చింతకాయల సన్యుజపాత్రుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

విజయనగరం..
విజయనగరం జిల్లా పార్వతిపురంలో టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పోలింగ్‌ బూత్‌లోకి ఎమ్మెల్సీ జగదీష్‌ సెల్‌ఫోన్‌ తీసుకెళ్లడంపై ఓటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

శ్రీకాకుళం..
శ్రీకాకుళం జిల్లాలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచి పోలింగ్‌ మందకొడిగా సాగింది. మధ్యాహ్నం నుంచి ఓటర్లు అధిక సంఖ్యలో వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తూర్పు రాయలసీమ..
తూర్పు రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నెల్లూరు జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా సాగాయి. డీకే డబ్ల్యూ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో కలెక్టర్‌ ముత్యాలరాజు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రామ్మూర్తి నగర్‌లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పట్టాభిరామిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ప్రకాశం..
ప్రకాశం జిల్లాలో మందకొడిగా ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికలు.. మధ్యాహ్నానికి పుంజుకున్నాయి. గిద్దలూరులో ఓ టీడీపీ ఎమ్మెల్యే అసిస్టెంట్‌ ఓటర్లకు డబ్బు పంపిణి చేస్తూ కెమెరాకు చిక్కారు. కందుకూరులో మాజీ ఎమ్మెల్యీ దివి శివరాం ఎలక్షన్‌ కోడ్‌ ఉల్లఘించారని పీడీఎఫ్‌ నాయకులు ఆరోపించారు. తమ గ్రామ సమస్యలు పరిష్కరించనందుకు నిరసనగా వెంకటాద్రిపాలెంలో 65 మంది ఓటర్లు ఎన్నికలను బాయ్‌కాట్‌ చేశారు.

తిరుపతి..
తిరుపతిలో టీడీపీ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారని తూర్పు రాయలసీమ పీడీఎఫ్ పట్టభద్రుల అభ్యర్థి యడవల్లి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. 258వ బూత్‌లో అధికార పార్టీ దొంగఓట్లు వేయిస్తుందని ఓటర్ల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. పీడీఎఫ్‌, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

అనంతపురం..
అనంతపురంలో తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రాలను మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరిశీలించారు.

కడప..
కడప జిల్లా పులివెందులలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రొద్దుటూరులో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మైదుకూరు, జమ్మలమడుగు, రైల్వే కోడూరులో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.

కర్నూలు..
కర్నూలు ప్రకాష్‌ నగర్‌లో టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ కుటుంబ సమేతంగా వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నంద్యాల, ఆదోని డివిజన్‌ కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 

Don't Miss