రాష్ట్ర వ్యాప్తంగా లెఫ్ట్..జనసేన 'హోదా'పోరు..

21:07 - April 6, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిస్టు, జనసేన శ్రేణులు పాదయాత్రలు చేపట్టాయి. అన్ని జిల్లాల్లోనూ పార్టీల నాయకులు, ఉత్సాహంగా పాదయాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేదాకా ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా.. విభజన హామీల అమలు కోరుతూ.. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు.. జనసేన శ్రేణులు కలిసి మహాపాదయాత్ర నిర్వహించారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, సీపీఎం కార్యదర్శి మధు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ సంయుక్తంగా జరిపిన పాదయాత్రకు మద్దతుగా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఆయా పార్టీల శ్రేణులు పాదయాత్రలు నిర్వహించారు.

పశ్చిమగోదావరి జిల్లా, నర్సాపురంలో వామపక్షాలు, జనసేన శ్రేణులు పాదయాత్ర నిర్వహించాయి. బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రజల నోట్లో మట్టి కొట్టిందని ఈ సందర్భంగా నాయకులు ఆరోపించారు. ఇదే జిల్లాలోని పెనుమంట్ర మండలం మార్టేరు నుంచి పెనుగొండ వరకు, సీపీఎం, సీపీఐ, జనసేన కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. పాలకొల్లులోనూ వామపక్ష, జనసేన కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. ఆంధ్రులను మోసం చేసిన మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనంటూ నినదించారు.

కాకినాడలోనూ వామపక్షాలు, జనసేన ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. బానుగుడి సెంటర్‌ నుంచి బాలాజీ చెరువు వరకూ పాదయాత్ర సాగించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై రాజీలేని పోరాటం చేస్తామని నాయకులు హెచ్చరించారు. రాజమండ్రిలోనూ సీపీఎం, సీపీఐ, జనసేన శ్రేణులు పాదయాత్ర నిర్వహించాయి. విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా పదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామన్న బీజేపీ నాయకులు.. ఏపీ ప్రజలను వంచించారని నాయకులు ఆరోపించారు.

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ.. గుంటూరు నగరంలోనూ వామపక్షాలు, జనసేన శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహం నుంచి బ్రహ్మానందరెడ్డి స్టేడియం వరకూ పాదయాత్ర నిర్వహించారు. అవిశ్వాస తీర్మానాల నుంచి మోదీ ప్రభుత్వం పారిపోయిందని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ఉద్యమాలను ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

నెల్లూరు జిల్లాలోనూ వామపక్షాలు, జనసేన నేతలు పాదయాత్ర నిర్వహించారు. నెల్లూరులోని ఆగ్మకూరు బస్టాండ్‌ నుంచి గాంధీ బొమ్మవరకూ పాదయాత్ర నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని కార్యకర్తలు నినదించారు. ఆత్మకూరులోనూ మూడు పార్టీలూ.. సీపీఎం కార్యాలయం నుంచి ఆర్టీసీ డిపో వరకూ పాదయాత్ర నిర్వహించారు. ప్రకాశం జిల్లాలోనూ జనసేన, వామపక్షాల నేతలు పాదయాత్ర నిర్వహించారు. చీరాలలో పాదయాత్ర అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం తాము ఉద్యమిస్తే.. అధికార పార్టీ జైలుకు పంపిందని విమర్శించారు. కేంద్రం దిగిరాకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కడప జిల్లాలోనూ సీపీఎం, సీపీఐ, జనసేన కార్యకర్తలు పాదయాత్ర చేశారు. జ్యోతిరావు ఫూలే విగ్రహం నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకూ పాదయాత్ర సాగింది. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందేనని పాదయాత్ర సందర్భంగా నాయకులు డిమాండ్‌ చేశారు. విభజన హామీలను నెరవేర్చాలని, ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. కర్నూలులో వామపక్ష, జనసే పార్టీలు పాదయాత్ర నిర్వహించాయి. జిల్లా పరిషత్‌ నుంచి జాతీయ రహదారి వరకూ పాదయాత్ర నిర్వహించారు. పార్లమెంటులో అవిశ్వాసం పెట్టినా... పార్లమెంటులో చర్చ రాకుండా డ్రామాలు ఆడిందని నాయకులు విమర్శించారు. ప్రత్యేక హోదా కోరుతూ జనసేన, వామపక్ష పార్టీల నాయకులు తిరుపతిలోనూ పాదయాత్ర నిర్వహించారు. నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారిపై తిరుచానూరు నుంచి తిరుపతి వరకూ పాదయాత్ర సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న నేతలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.

విశాఖపట్టణంలోనూ సీపీఎం, సీపీఐ, జనసేన శ్రేణులు పాదయాత్ర నిర్వహించాయి. తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేశాక, బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చేస్తోన్న నమ్మక ద్రోహానికి నిరసనగా.. జాతీయ రహదారిపై శాంతియుత పాదయాత్ర చేపట్టారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా మోదీ సర్కారు చేసిన ప్రయత్నాన్ని వామపక్ష, జనసేన నేతలు తప్పుబట్టారు. ఏపికి ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు డిమాండ్లతో శ్రీకాకుళం జిల్లాలోనూ వామపక్షాలు, జనసేన శ్రేణులు పాదయాత్ర నిర్వహించాయి. శ్రీకాకుళం, కాశీబుగ్గల నుంచి హైవేల దాకా పాదయాత్రలు కొనసాగాయి. టెక్కలిలోనూ అంబేడ్కర్‌ కూడలి నుంచి, ఇచ్చాపురం, ఎచ్చెర్ల, ఆముదాల వలసలలోనూ పాదయాత్రలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నాయకులు ఈ సందర్బంగా తప్పుబట్టారు.

Don't Miss