మోడీని కలిసిన ఏపీ ఎంపీలు

07:24 - January 6, 2018

ఢిల్లీ : పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ, బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీని కలిశారు. పార్లమెంట్‌ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడడంతో... మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిసిన ఎంపీలు... అన్ని అంశాలపై మోదీ సానుకూలంగా స్పందించారన్నారు. రైల్వేజోన్‌, ప్రత్యేక ప్యాకేజి, పోలవరం, అసెంబ్లీ స్థానాల పెంపు అంశాలను ఎంపీలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం 16 పేజీల మెమోరాండాన్ని మోదీకి అందజేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కాల పరిమితితో పూర్తి చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

రెవెన్యూ లోటు 7500 కోట్ల రూపాయలు
ఇక 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు 7500 కోట్ల రూపాయలపాయలకు గాను 3979 కోట్లు మాత్రమే ఇచ్చిన విషయాన్ని మోదీకి తెలిపారు. మిగిలిన బకాయిలు చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. EAP ప్రాజెక్టులకు రుణాల రూపంలో నిధులివ్వాలని కోరారు. అలాగే... కేంద్రం, నాబార్డ్‌ ఇచ్చిన రుణాలకు చెల్లించాల్సిన వడ్డీల కింద EAP కింద ఇచ్చే నిధులను జమ చేసుకోవాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఇక ఏపీ భవన్‌ విభజనను కూడా వేగవంతం చేయాలని ఎంపీలు కోరారు. అయితే.. త్వరలోనే చంద్రబాబు తనను కలవనున్నట్లు మోదీ తెలిపారన్నారు ఎంపీలు. అన్ని అంశాలను భేటీలో చర్చించనున్నట్లు ప్రధాని తెలిపారన్నారు.మొత్తానికి రాష్ట్ర సమస్యల పట్ల మోదీ సానుకూలంగా స్పందించడంతో నేతలంతా సంతోషం వ్యక్తం చేశారు. 

Don't Miss