నిరాశలో వైసీపీ నేతలు, కార్యకర్తలు

07:06 - September 13, 2017

విజయవాడ : నంద్యాల, కాకినాడ ఓటములు వైసీపీని నిరాశపర్చాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నారు. వాస్తవానికి నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయంపై వైసీపీ చాలా ఆశలు పెట్టుకుంది. నంద్యాలలో గెలిచి అధికారపార్టీకి దిమ్మతిరిగే షాక్‌ ఇవ్వాలని భావించింది. అందుకే నంద్యాల ఉప ఎన్నికను ప్రభుత్వ వ్యతిరేకతకు రిఫరెండం అంటూ వైసీపీ ఎన్నికల్లో ప్రచారం చేసింది. కానీ ఫలితాలు మాత్రం టీడీపీకే అనుకూలంగా వచ్చాయి. వైసీపీకి ఊహించని షాక్‌ తగిలింది. దీంతో నేతల్లో ఉత్సాహం తగ్గింది. కార్యకర్తలు నైరాశ్యంలోకి వెళ్లారు.

వైఎస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమానికి రూపకల్నన
పార్టీ నేతలను ఆవహించిన నైరాశాన్ని పారదోలేందుకు, ఎన్నికల ఫలితాల నుంచి క్యాడర్‌ను బయటపడేసేందుకు వైసీపీ అధినేత జగన్‌... వైఎస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమానికి రూపకల్న చేశారు. అంతేకాదు... ప్లీనరీలో ప్రకటించినట్టుగా నవరత్నాలపై కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. సమావేశాలు, సభల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అయితే పార్టీ ఓటమితో నిరాశలో ఉన్న కొంతమంది కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అధినేత ఆదేశించినా వాటిని పాటించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. కొందరు నామమాత్రంగా పనిచేస్తోంటే.... మరికొందరు కనీసం వాటి గురించి ఆలోచించడం లేదు. అధినేత జగన్‌ కూడా లండన్‌ పర్యటనలో ఉండడంతో పార్టీలో ఎవరికివారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

విజయవంతంగా ఇంటింటికీ టీడీపీ
ఏపీలో అధికార టీడీపీ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీనేతలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ప్రతిపక్షమైన వైసీపీ మాత్రం తీసుకున్న కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టలేక పోతోంది. మొత్తానికి రెండు ఓటములతో గాడి తప్పింది ప్రతిపక్ష వైసీపీ. గాడితప్పిన నేతలను అధినేత జగన్‌ ఎలా దారిలోకి తెచ్చుకుంటారో వేచి చూడాలి.

Don't Miss