కథువా ఘటనపై నిరసనలు..

07:44 - April 17, 2018

విజయవాడ : చిన్నారి ఆసిఫాను అత్యంత దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరులో భారీ క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థినులు, జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. గుంటూరులోని అంబేద్కర్‌ విగ్రహం దగ్గర క్రొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. అభంశుభం తెలియని చిన్నారిని అత్యంత పాశవికంగా హత్యచేసిన వారిని ఎందుకు శిక్షించడం లేదని వారు ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. గోవధపై తక్షణం స్పందించిన మోదీ ప్రభుత్వం.. అమ్మాయిలను హత్యచేస్తుంటే ఎందుకు పెదవి విప్పడంలేదని ప్రశ్నించారు. చట్టాల్లో మార్పులు తీసుకురావాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ చేశారు.

చట్టాల్లో మార్పులు చేయాలని కోరిన విద్యార్థినులు..
చిన్నారి ఆసిఫాకు న్యాయం చేయాలని విశాఖలో విద్యార్థిలోకం గొంతెత్తింది. నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ దగ్గర ఈ ర్యాలీ జరిగింది. హంతకులెవరో తెలిసినా ఇంతవరకు వారికి ఎందుకు శిక్షించడం లేదని విద్యార్థినులు ప్రశ్నించారు. 

Don't Miss