నిర్లక్ష్యం ఖరీదు నిండుప్రాణం

16:49 - September 3, 2017

నెల్లూరు : నిర్లక్ష్యానికి దర్పణం ఈ మృతదేహం. నెల్లూరులో ఏకె-47 మిస్‌ఫైర్‌ కలకలం రేపింది. ఏఎస్పీ గన్‌మెన్‌ దగ్గరి ఏకె 47 మిస్‌ఫైర్‌ అయ్యింది. ఈ ప్రమాదంలో ఏఎస్పీ కారు డ్రైవర్‌ రమేశ్‌ ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ రమేశ్‌ మృతి చెందాడు. నెల్లూరు జిల్లా, పోలీసు కార్యాలయం వద్ద రాత్రి 10 గంటలకు.. ఈ ఘటన జరిగింది. ఏఎస్పీ శరత్‌బాబు తన డ్రైవర్‌తో ఎస్పీని కలిసి వెళ్లేందుకు కార్యాలయానికి వెళ్లమని ఆదేశించారు. దీంతో డ్రైవర్‌ రమేశ్‌ ఏఎస్పీ వాహనాన్ని పోలీసు కార్యాలయంలోకి తీసుకొచ్చారు. వాహనం ఆగిన వెంటనే ఏఎస్పీ శరత్‌బాబు కిందికి దిగిన క్షణంలోనే.. గన్‌మ్యాన్‌ నాగేంద్ర వద్ద ఉన్న గన్‌ మిస్‌ ఫైర్‌ అయ్యింది.

పలు రకాల అనుమానాలు
రెండు రౌండ్‌లు డ్రైవర్‌ రమేశ్‌ ఒంట్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఒకటి ఛాతి మీదుగా వెళ్లి కార్యాలయం గోడకు తగలగా.. రెండో బుల్లెట్‌ ఛాతి కింది భాగంలో ఎడమవైపు నుంచి కుడివైపుకు దూసుకొచ్చింది. అనుకోని పరిణామంతో ఏఎస్పీ కూడా భయభ్రాంతులకు గురయ్యాడు. పెద్ద శబ్దం రావడంతో అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది.. డ్రైవర్‌ రమేశ్‌ను హుటాహుటిన బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ రామకృష్ణ, ఏఎస్పీ శరత్‌బాబు ఇతర పోలీసు అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకొని.. అండగా నిలిచినప్పటికీ రమేశ్ ప్రాణాలను కాపాడలేకపోయారు. రమేశ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని జిల్లా ఎస్పీ రామకృష్ణ తెలిపారు. నెల్లూరు జిల్లా, సీతారామపురానికి చెందిన రమేశ్ 2009లో పోలీసు ఉద్యోగంలో చేరాడు. ఈ ఘటనకు కారణమైన గన్‌మ్యాన్‌ నాగేంద్ర... 2011 బ్యాచ్‌కు చెందినవాడు. గత జనవరి నుంచి ఏఎస్పీ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ ఘటనలో గన్‌మ్యాన్‌ నిర్లక్ష్యమే కారణమని పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రమేశ్ మృతి పట్ల అతని బంధవులు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Don't Miss