’ఓషో’లో అమీర్...అలియా...

08:40 - September 26, 2018
ఇప్పుడు బయోపిక్‌ల హవా నడుస్తోంది. విఖ్యాత ఆధ్యాత్మిక బోధకుడు రజనీష్ అలియాస్‌ ఓషో జీవిత చరిత్ర.. త్వరలోనే తెరకెక్కబోతోంది. ఓషోపై "వైల్డ్ వైల్డ్ కంట్రీ" పేరుతో ఒరిజినల్ డాక్యుమెంటరీ అందించిన నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. ఇప్పుడు ఆయన జీవిత కథతోనే వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తోంది. వైల్డ్ వైల్డ్ కంట్రీ సిరీస్‌లో భాగంగా నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాది మార్చి 16న ఆరు ఎపిసోడ్స్‌ను అందించింది. ఆరున్నర గంటల నిడివితో ఉన్న ఈ  డాక్యుమెంటరీని సూడాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రదర్శించారు.

నెట్‌ఫ్లిక్స్‌ రూపొందించబోయే తాజా వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఓషోగా నటిస్తున్నారు. ఆయన పర్సనల్ సెక్రటరీ మాతా ఆనంద్ షీలా పాత్రలో అలియాభట్ నటించనున్నారు. అమిర్ ఖాన్.. తన సొంత బ్యానర్‌ అమీర్‌ ప్రొడక్షన్స్‌పై ఈ వెబ్‌సిరీస్‌ను నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మించనున్నారు. సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన సేక్రెడ్ గేమ్స్... భారత్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు మంచి గుర్తింపును తెచ్చింది. దీంతో, తమ పరిధిని పెంచుకోడానికి నెట్‌ఫ్లిక్స్‌... ఈసారి అమిర్ ఖాన్, అలియా భట్‌తో ఓషో జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. వైల్డ్ వైల్డ్‌ కంట్రీ సిరీస్‌ను రజనీష్ ఒరిజినల్ ఫుటేజీతో రూపొందించారు. అయితే.. ఇప్పుడు ఆ పాత్రను అమీర్‌ ఎంతవరకు రక్తి కట్టిస్తారు..? ప్రజలపై ఓషో ప్రభావం గురించి, ఆధ్యాత్మికత, సస్పెన్స్, శృంగార అంశాలను ఇందులో చూపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Don't Miss