ఆరుషిని హత్య చేసిందెవరు

07:18 - October 13, 2017

అలహాబాద్ : 9 ఏళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్‌ హత్య కేసులో అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆరుషి తల్లిదండ్రులు రాజేష్‌ తల్వార్, నుపూర్‌ తల్వార్‌లను నిర్దోషులుగా పేర్కొంటూ అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులే చంపారనడానికి ఎలాంటి ఆధారాలు లేని కారణంగా అనుమానం కింద శిక్షలు విధించలేమని కోర్టు స్పష్టం చేసింది. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద న్యాయస్థానం ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా ప్రకటించింది.

బెడ్‌రూమ్‌లో ఆరుషి హత్య...
2008 మే 16వ తేదీన నోయిడా జలవాయువిహార్‌లోని సొంత ఇంట్లోనే బెడ్‌రూమ్‌లో ఆరుషి హత్యకు గురైంది. ఆమెను గొంతుకోసి చంపేశారు. ఈ ఘటన తర్వాత పనిమనిషి హేమరాజ్‌ కనిపించకుండా పోయాడు. అతడే ప్రధాన నిందితుడైన ఉంటాడని పోలీసులు తొలుత భావించారు. ఆ మరుసటి రోజు పనిమనిషి హేమరాజ్ శవం అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌పై కనిపించడంతో కేసు మరో మలుపు తిరిగింది. బెడ్‌రూమ్‌లో ఆరుషి, హేమరాజ్‌లు సన్నిహితంగా ఉండడం చూసిన ఆరుషి తల్లిదండ్రులే హత్య చేశారన్న అనుమానంతో పోలీసులు రాజేష్‌ తల్వార్, నుపుర్‌ తల్వార్‌లను అరెస్ట్‌ చేశారు. పరువుహత్యకు సంబంధించిన ఈ కేసును అప్పటి యూపీ ప్రభుత్వం 2008 మేలో సిబిఐకి అప్పగించింది. ఏడాదిపాటు విచారణ అనంతరం డాక్టర్‌ రాజేష్ సహాయకుడు కృష్ణ, పనిమనుషులు రాజ్‌కుమార్‌, విజయ్‌లను నిందితులుగా పేర్కొన్న సిబిఐ- వారిపై ఆరోపణలను నిరూపించలేకపోయింది. దీంతో ఈ కేసును 2009లో సిబిఐలోని మరో బృందానికి అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన సిబిఐ- రాజేష్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఈ కేసును విచారించిన గజియాబాద్‌లోని సిబిఐ ప్రత్యేక కోర్టు నవంబర్ 25, 2013న ఆరుషి తల్లిదండ్రులను దోషులుగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది.

నిర్దోషులుగా రాజేశ్‌ దంపతులు
సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆరుషి తల్లిదండ్రులు రాజేష్‌ తల్వార్, ఆయన భార్య నుపూర్ తల్వార్‌ 2014లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద రాజేశ్‌ దంపతులను నిర్దోషులుగా ప్రకటించింది. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ అంటే.. కేసులో ఆధారాలు సరిగా లేనప్పుడు నిందితులకు అనుకూలంగా తీర్పిచ్చేందుకు న్యాయవ్యవస్థలో వెసులుబాటు ఉంటుంది. ఈ కేసులో తమకు న్యాయం జరిగిందని హైకోర్టు తీర్పుపై ఆరుషి తల్లి నుపుర్‌ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సిబిఐ స్పందించింది. కోర్టు కాపి అందిన తర్వాత పూర్తిగా చదివి విశ్లేషణ చేశాకే ఈ కేసులో ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది. 

Don't Miss