ప్రిన్స్ మహేశ్ మూవీ..'కీ'రోల్ లో అదితీ?..

16:44 - June 21, 2018

అదితీ రావు నటన గురించి చెప్పాలంటే ఒక్క మాట చాలదు. కళ్లతో పలికించే హావభావాలు చాలు ఆమె నటన ఏమిటో చెప్పేందుకు. ముగ్ధమనోహరంగా కనిపించే అదితీ అందంలోనే కాదు అభినయంలో కూడా విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది. మనిషికి కావాల్సింది అందం ప్రధానం కాదు మనస్సు కూడా అందంగా వుంటేనే మనిషికి పరిపూర్ణత అని చెప్పే అరుదైన, అందాల, ఆత్మవిశ్వాసం కలిగిన నటి అదితీరావు. మణిరత్నం సినిమా 'చెలియా'లో కార్తీ సరసన నటించి నటనాభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. తెలుగు అదితీ మొదటి సినిమా 'సమ్మోహనం'లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని మరింతగా ఆశ్చర్యపరిచింది. ఆ అరుదైన అందాల నటి ఇప్పుడు ప్రిన్స్ మహేశ్ బాబు సినిమాలో కీలకపాత్రలో నటించనున్నట్లుగా సమాచారం.

మహేశ్ సినిమాలో అదితీరావు
వంశీ పైడిపల్లి .. మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'డెహ్రాడూన్'లో జరుగుతోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఒక ముఖ్యమైన పాత్ర కోసం అదితీ రావును తీసుకున్నారనేది తాజా సమాచారం.

'సమ్మోహనం'లో మార్కులు కొట్టేసిన అదితి
రీసెంట్ గా రిలీజైన 'సమ్మోహనం' సినిమాలో అదితీ రావు కథానాయికగా నటించింది. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను మంచి మార్కులు కొట్టేసింది. అదితీ రావు నటనను మహేశ్ బాబు అభినందించడం .. 'సమ్మోహనం' సక్సెస్ టాక్ తెచ్చుకోవడం ఆమెకి ఈ ఛాన్స్ వచ్చేలా చేశాయనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. అదితీ రావు మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్నవారి సంఖ్య ఎక్కువగానే వుంది.

Don't Miss